ఘనంగా ధ్వజపట లేఖనం
నేడు రామాలయంలో ధ్వజారోహణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న వసంత ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం గరుడాధివాసం, ధ్వజపట లేఖనం కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ప్రధాన సంకేతమైన గరుత్మంతుడి బొమ్మను జీయర్ మఠంలో ఆలయ అర్చకులు వస్త్రంపై లిఖించారు. ప్రత్యేక పూజల అనంతరం గరుత్మంతుడి చిత్రపటానికి హారతి సమర్పించారు. ఈ సందర్భంగా దేవనాథ జీయర్ స్వామి భక్తులకు ప్రవచనం అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, చతుఃస్థానార్చన జరపనున్నారు. ఈ సందర్భంగా సంతాన ప్రాప్తి కోసం మహిళలకు గరుడ ప్రసాదాన్ని అర్చకులు అందజేస్తారు. పూజల్లో ఆలయ ప్రధానార్చకులు విజయరాఘవన్, స్థానాచార్యులు స్థలశాయి తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో శ్రీదేవీ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నాదనీరాజనం, సూక్తి పారాయణం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, లక్ష కుసుమార్చన, శ్రీలలితా సహస్ర నామ హవనం తదితర కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత అమ్మవారికి నివేదన సమర్పించి హారతి ఇచ్చాక అర్చకులు మంత్రపుష్పం పఠించారు.
రామయ్యను దర్శించుకున్న
కేరళ ఐఏఎస్ అధికారి
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కేరళకు చెందిన ఐఏఎస్ అధికారి సాయికృష్ణ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వాగతం పలకగా, ఆలయ అధికారులు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్‌కుమార్, పీఆర్‌ఓ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలంలో నేడు తుమ్మల పర్యటన
భద్రాచలం: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ రూట్ మ్యాప్‌ను గురువారం విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు సుభాష్‌నగర్‌లో నిర్మాణం చేపడుతున్న కరకట్ట పనులను పర్యవేక్షిస్తారని, 10:30 గంటలకు మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం, పట్టాభిషేకం ఏర్పాట్లు పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఉత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు.
రేపటి వరకు
తేలికపాటి వర్షాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఈనెల 5వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ వి.నారాయణమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు కోసి ఆరబెడుతున్న పంట ఉత్పత్తులపై టార్పాలిన్లు కప్పుకోవాలని, కోత దశలో ఉన్న పంటలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఘనంగా ధ్వజపట లేఖనం
ఘనంగా ధ్వజపట లేఖనం
ఘనంగా ధ్వజపట లేఖనం


