● ఇళ్లు నిర్మించుకునేందుకు తప్పని తిప్పలు ● పట్టించుకోని సంబంధిత అధికారులు
మణుగూరు రూరల్ : పక్కనే గోదావరిలో ఇసుక పుష్కలంగా ఉన్నా సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయింది. దీంతో ఇంటి నిర్మాణాలకు మణుగూరు మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదే దళారులకు అడిగినంత చెల్లిస్తే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా లారీల కొద్దీ ఇసుక సరఫరా చేస్తున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.500 నుంచి రూ.800 ఖర్చు చేస్తే, ప్రస్తుతం రూ.2వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం సంబంధిత శాఖల ద్వారా తక్కువ ధరకు ఇసుక సరఫరా చేయలేకపోవడంతో ప్రజలు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఇసుక దందా జోరుగా సాగుతోంది. మండలంలోని చినరాయిగూడెం, అన్నారం, కొండాయిగూడెం వంటి గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఇళ్ల కట్టడాలు, ప్రాజెక్టుల పనులు ప్రారంభమవుతుండటంతో ఇసుక డిమాండ్ ఎక్కువే ఉంది. ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికే ఇసుక సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా, ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీంతో ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు దళారులను ఆశ్రయించి రూ.లక్షలు చెల్లించాల్సి వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. లేకపోతే ఇసుక లేక నిర్మాణాలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. నిర్మాణాలకు సిమెంట్, ఐరన్, కంకర కొనుగోలు చేయడం కంటే ఇసుక కొనుగోలు చేయడమే భారంగా మారిందని గృహ నిర్మాణదారులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సామాన్యులకు ఇసుక లేకపోవడంతో నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకే ఇసుక సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతుందే.. కానీ ఆ దిశగా చర్యలు మాత్రం కనబడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇసుక లారీ సీజ్
పాల్వంచరూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని రెవెన్యూ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. మండల పరిధిలోని నాగారం గ్రామం నుంచి ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు తహసీల్దార్ వివేక్ తెలిపారు. శనివారం రాత్రి జగన్నాథపురం వద్ద మట్టిని తరలిస్తున్న మరో రెండు లారీలను పట్టుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.