దొడ్డురకాలకే మొగ్గు
బోనస్ రాట్లే..
దిగుబడి తగ్గింది
● యాసంగిలో అధిక విస్తీర్ణంలో కామన్ గ్రేడ్ వరిసాగు ● గతేడాది సన్నాలకు బోనస్ రాకపోవటంతో రైతుల్లో అనాసక్తి ● దిగుబడి తగ్గి, పెట్టుబడి పెరగడం కూడా మరో కారణం
బూర్గంపాడు: యాసంగి సీజన్‌లో రైతులు దొడ్డురకం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. సన్నరకాల సాగుకు పెట్టుబడులు పెరిగి దిగుబడి తగ్గడ, గతేడాది యాసంగి సీజన్‌లో ప్రభుత్వం బోనస్ అందించకపోవటంతో ఎక్కువ మంది రైతులు దొడ్డు రకాల వైపే మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో ప్రస్తుత యాసంగిలో సుమారు 80వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టనున్నారు. ఇప్పటికే రైతులు వరినార్లు పోసుకుని నాట్లు వేసేందుకు పొలాలు సిద్ధం చేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో ఎంటీయూ 1010, కేఎన్‌ఎం 118 వంటి దొడ్డురకాలను సాగు చేస్తున్నారు.
అందని గత యాసంగి బోనస్..
గతేడాది యాసంగిలో కూడా సన్నరకాలకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ధాన్యం అమ్మిన రైతులకు సుమారు రూ.18 కోట్ల వరకు బోనస్ ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది వానాకాలం ధాన్యం అమ్మకాలు కూడా పూర్తికావస్తున్నాయి. కానీ ఇప్పటివరకు సన్నరకం ధాన్యానికి బోనస్ అందలేదు. వానాకాలంలో అధిక వర్షాలతో చీడపీడలు, పురుగు, దోమ ఆశించటంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. దిగుబడి తగ్గి ఎకరాకు 25 బస్తాలకు మించలేదు. ఈ పరిస్థితులు రైతులను మళ్లీ దొడ్డురకం సాగువైపు మళ్లించాయి. కాగా కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి ‘ఏ’గ్రేడ్ (సన్నరకం) రకమైతే రూ. 2,389 చెల్లిస్తుంది. కామన్ గ్రేడ్(దొడ్డురకం) అయితే రూ.2,369 చెల్లిస్తుంది. రెండింటి మధ్య తేడా కేవలం రూ.20 మాత్రమే ఉంది.
గతేడాది యాసంగిలో అమ్మిన ధాన్యానికి ఇప్పటివరకు బోనస్ అందలేదు. వస్తాదో రాదో తెలియదు. సన్నరకం వరి సాగుకు పెట్టుబడులు ఎక్కువ పెట్టాలి. బోనస్ రానప్పుడు సన్నాల కంటె దొడ్డు రకమే నయం. అందుకే యాసంగిలో దొడ్డురకం వరి నాటేందుకు నారు పోశాను.
–యడమకంటి నర్సింహారెడ్డి, రైతు
సన్నరకం వరి సాగు చేస్తే దిగుబడులు రావటం లేదు. తెగుళ్లు, పురుగు, దోమ ఉధృతితో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం బోనస్ వేయకపోతే దొడ్డురకం సాగే మేలనిపిస్తుంది. ఈ యాసంగిలో దొడ్డురకమే సాగు చేస్తున్నాం.
–ఆవుల వెంకటేశ్వరరెడ్డి, రైతు
దొడ్డురకాలకే మొగ్గు
దొడ్డురకాలకే మొగ్గు


