జిల్లా వైద్య బృందానికి ప్రశంసలు
చుంచుపల్లి: భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో టీవీవీపీ ఆస్పత్రుల్లో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని, ఇతర జిల్లాలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ భద్రాద్రి ప్రశంసలు కురిపించారు. డీసీహెచ్‌ఎస్ రవిబాబుతో పాటు చర్ల, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట ఆస్పత్రుల సిబ్బందిని శుక్రవారం సచివాలయానికి ఆహ్వానించి అభినందనలు తెలిపారు. చర్ల లాంటి మారుమూల ప్రాంతంలో సైతం అందుబాటులో ఉన్న వసతులతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని, చర్ల స్ఫూర్తితో ఇతర జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ఇదే తరహా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సర్వే తీరును
తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
పాల్వంచ: కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్‌ఓ తుకారంరాథోడ్ అన్నారు. ఈ నెల 18 నుంచి 25 వరకు కుష్టు వ్యాధి గ్రస్తుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణ పరిధిలోని బొల్లేరుగూడెం, గట్టాయిగూడెం, రాంనగర్‌లలో పర్యటించి వ్యాధి లక్షణాల గుర్తింపు సర్వేను ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. స్పర్శలేని, ఎర్రని, రాగి రంగు మచ్చలు, మొద్దుబారిన కాళ్లు, చేతులు, తిమ్మిరి లక్షణాలు ఉన్నట్లయితే వ్యాధిగా అనుమానించి, ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలన్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. సర్వేలో 1,407 మంది ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొని, 60,360 గృహాలను సందర్శించి, 2,14,473 మందిని పరీక్షించారని చెప్పారు. 510 అనుమానిత కేసులు నమోదు చేశారని, వారిలో 102 మందిని పరీక్షించి, కుష్టు రహిత వ్యక్తులుగా గుర్తించామని ఆయన వివరించారు. జిల్లా పారామెడికల్ ఆఫీసర్ తేజావత్ మోహన్, డాక్టర్ దేవేందర్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
వీకే–7 ఓసీలో మళ్లీ ప్రమాదం
● బ్రేకులు ఫెయిల్ అయిన వోల్వో
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే–7 ఓసీలో శుక్రవారం మళ్లీ ప్రమాదం జరిగింది. క్వారీలో నడుస్తున్న వోల్వో బ్రేకులు ఫెయిలయ్యాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే చర్చ సాగుతోంది. 40 రోజుల్లో ఇది మూడో ప్రమాదం. ఈ విషయమై సింగరేణి డైరెక్టర్ పీపీ వెంకటేశ్వరరావు.. ఏరియా ఇన్‌చార్జ్ జీఎంతో మాట్లాడి జరిగిన వివరాలు తెలుసుకున్నారు.
విద్యార్థిని ఆత్మహత్య
ఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన కుంజ అఖేళ (24) గురువారం అర్ధరాత్రి పురుగులమందు సేవించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఖమ్మంలో చదువుకుంటున్న అఖేళ ఓటు వేసేందుకు ఇంటికి చేరుకుంది. తాను పురుగులమందు తాగానని గురువారం అర్ధరాత్రి తల్లికి తెలిపింది. వెంటనే ఇల్లెందు ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించింది. ఖమ్మంలో చికిత్స పొందుతూ అఖేళ మృతి చెందింది. మృతురాలి తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సురేశ్ తెలిపారు.
చెట్టును ఢీకొట్టిన కారు
దమ్మపేట: మండలంలోని అర్లపెంట శివారులో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి మందలపల్లికి చెందిన దుశ్యంత్, సత్తుపల్లి వాసి నీరజ్, పాల్వంచకు చెందిన ప్రవీణ్.. కారులో పాల్వంచ నుంచి దమ్మపేట వైపునకు వస్తుండగా అర్లపెంట శివారులోని గండి ముత్యాలమ్మ ఆలయం సమీపంలోని మూలమలుపు వద్ద చెట్టును ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులకు గాయాలు కాగా స్థానికులు 108 ద్వారా ద మ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మె రుగైన వైద్యం కోసం సత్తుపల్లికి తరలించారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియరాలేదు.
డివైడర్ ఎక్కిన లారీ..
అశ్వాపురం: మండల కేంద్రంలో ఎస్‌కేటీ ఫంక్షన్‌హాల్ ఎదుట శుక్రవారం రాత్రి లారీ డివైడర్‌ను ఢీకొట్టి దానిపైకి ఎక్కింది. గతంలోనూ పలుమా ర్లు వాహనాలు డివైడర్‌ను ఢీకొట్టాయి. మండల కేంద్రంలో రహదారి విస్తరణ పనులను నిలిపివేశారు. కనీసం డివైడర్ల వద్ద ఎలాంటి ప్రమాద సూచిక బోర్డు, సిగ్నళ్లు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి కనీసం డివైడర్ల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
జిల్లా వైద్య బృందానికి ప్రశంసలు


