● ఇంకుడు, నీటి గుంతలు నిర్మించాలి ● ప్రపంచ నీటి దినోత్సవంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్
పాల్వంచరూరల్: భూగర్భజలాల పెంపు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామ రైతు వేదికలో శనివారం జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఇంట్లో ఇంకుడు గుంతలు, పంట పొలాల్లో ఫారం పాండ్లు నిర్మించుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని చెప్పారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలలని, వివిధ వనరులకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, నీటి వనరుకు మాత్రం ప్రత్యామ్నాయం లేదని వివరించారు. ఇంటి ఆవరణలో, ఉద్యాన వనాల్లో, రహదారుల పక్కన మ్యాజిక్ సోక్ పిట్స్ నిర్మించాలని సూచించారు. రైతులు మునగ సాగుకు ముందుకు రావాలన్నారు. విరివిగా చెట్లను పెంచి పర్యావరణాన్ని రక్షించాలన్నారు. నివాసాల్లో తీసుకుంటున్న మ్యాజిక్ సోక్ పిట్ పనులను పరిశీలించి, వారితోపాటు కలిసి పనిచేశారు. మూడు రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక్కో సోక్ పిట్ కోసం ప్రభుత్వం రూ.6,800 చెల్లిస్తోందని తెలిపారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఈఏ బాబూరావు మాట్లాడుతూ నీటి వినియోగంపై అంతరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. రీచార్జి గుంతలు, సేద్యపు గుంతలు, కందకాలను నిర్మాణంచేసుకోవాలని, ఇంటిపైకప్పు, రోడ్డుపై పడిన వర్షపు నీటిని రీచార్జి గుంతల ద్వారా కందకాలకు మళ్లించుకోవాలని సూచించారు.
ఉపాధి పనులకు హాజరు కావాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా ఉపాధిహామీ పథకం పనులు కోరే ప్రతీ ఒక్కరు హాజరు కావాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో పెద్దఝెత్తున పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ నెల 29వ తేదీ వరకు వారం రోజులు వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు. బోరు ఆధారిత వ్యవసాయ భూముల్లో రైతులు ఫారం పాండ్స్ నిర్మించుకోవాలన్నారు.
బైక్‌పై వెళ్లి.. పలుగుతో గుంత తవ్వి..
పాల్వంచ మండలం తోగ్గూడెంలో ఉపాధి పనులను కలెక్టర్ జితేష్ పరిశీలించారు. తోగ్గూడెం ప్రధాన రహదారి మీదుగా ఉపాధి పనులు నిర్వహించే ప్రదేశానికి వాహనాలు వెళ్లే అవకాశంలేదు. దీంతో కలెక్టర్ కారును పక్కన పెట్టి సిబ్బంది ద్విచక్రవాహనంపై కూర్చుని సుమారు రెండు కిలోమీటర్లు ప్రయాణించి ఉపాధి పని ప్రదేశానికి వెళ్లారు. ఉపాధి కూలీలతో మాట్లాడారు. పలుగు(గడ్డపార) చేత పట్టి నీటిగుంతను తవ్వి కొద్దిసేపు పనిచేశారు. తవ్వకం పనులు అంత సులువు కాదని, నిత్యం పనిచేసేవారికే స్కిల్స్ ఉంటాయని, వారే సులువుగా గుంతలు తవ్వగలరని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఏఓ బాబూరావు కూడా పలుగు పట్టి గుంత తవ్వారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా భూగర్భజల అధికారి రమేష్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేశ్, తహసీల్దార్ వివేక్, ఎంపీడీఓ కె.విజయభాస్కరరెడ్డి, ఎయిడ్ ఎన్‌జీఓ హరిప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.