
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ప్రతీ దరఖాస్తును పరిశీలించాలి
అదనపు కలెక్టర్ వేణుగోపాల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును నిశితంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఆయన వినతులు స్వీకరించారు. పరిష్కారానికి సంబంఽధిత అధికారులకు ఎండార్స్ చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ 9వ వార్డులో మసీదుకు వెళ్లే దారిలో వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. చర్ల మండలం దోసినపల్లిలో తమకు ఆరెకరాల పొలం ఉందని, తమ పెద్ద సోదరుడు ఒక్కరే పట్టా చేయించుకున్నాడని, తనకు, తన తమ్ముడికి అన్యాయం చేశాడని అంబేద్కర్ నగర్‌కు చెందిన చింతల భాస్కర్‌రావు ఫిర్యాదు చేశాడు.
ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓగా జయలక్ష్మి
కొత్తగూడెఅర్బన్ : జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఎల్.భాస్కర్‌నాయక్ సోమవారం ఉద్యోగ విరమణ చేయగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా డాక్టర్ జయలక్ష్మి ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె ఈ పోస్టులో కొనసాగుతారు. కాగా, ఉద్యోగ విరమణ పొందిన భాస్కర్‌ను సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజకుమార్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాధామోహన్, డీసీహెచ్‌ఎస్ రవిబాబు, ప్రోగ్రామ్ ఆఫీసర్ మధువరణ్, ఏఓ సుకృత తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్‌లో బదిలీలు షురూ
చుంచుపల్లి : ఉమ్మడి జిల్లా సెర్ప్ ఉద్యోగుల్లో బదిలీల సందడి నెలకొంది. మొదట ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది మంది డీపీఎంలకు సోమవారం స్థాన చలనం కలిగించారు. వీరిలో జిల్లా నుంచి ఐదుగురు, ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి బదిలీ అయిన వారికి ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, హైదరాబాద్ సెర్ప్ కార్యాలయాల్లో పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో జిల్లా నుంచి జి.రమాకాంత, సునందన్, నాగజ్యోతి, యాదయ్య, శేఖర్ ఉండగా, ఖమ్మం నుంచి శ్రీనివాస్, అంజనేయులు, లక్ష్మీనారాయణ ఉన్నారు. కాగా, ఏపీడీ, ఏపీఎంలు, ఎంఎస్ సీసీలు, సీసీలు, అడ్మిన్ అసిస్టెంట్లకు కూడా త్వరలో బదిలీలు కానున్నాయి.
స్వయం ఉపాధితో ఆదర్శం
భద్రాచలం: స్వయం ఉపాధి పొందుతూ, ఆర్థికాభివృద్ధి సాధిస్తూ దేశంలో గిరిజన మహిళలు ఆదర్శనీయంగా నిలుస్తున్నారని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలోని గిరిజన దర్బార్‌కు వచ్చిన ఆయన సమస్యలపై పీఓతో చర్చించారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ యూనిట్ ద్వారా తయారు చేసిన న్యూట్రిషన్ పదార్థాలు అమ్మకాలు జరిపే స్టాల్‌ను సందర్శించారు. మిల్లెట్ బిస్కెట్లు, సబ్బులు, షాంపుల తయారీ, అమ్మకాల వివరాలు తెలుసుకున్నారు. పీఎం మోదీ మన్‌కీ బాత్‌లో భద్రాచలం ఐటీడీఏ గిరిజన మహిళల ప్రస్తావన తెచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, వారిని అభినందించారు. సరసమైన ధరలలో విక్రయించాలని, తగిన మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు. గ్రూప్ మహిళలు విజయలక్ష్మి, సమ్మక్క, సున్నం ఈశ్వరి, సున్నం స్వాతి, బేబీ రాణి, జగ్గా కుమారి పాల్గొన్నారు.

రామయ్యకు ముత్తంగి అలంకరణ