‘సీతారామ’తో న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సీతారామ’తో న్యాయం చేయాలి

Jul 1 2025 4:15 AM | Updated on Jul 1 2025 4:15 AM

‘సీతారామ’తో న్యాయం చేయాలి

‘సీతారామ’తో న్యాయం చేయాలి

● జిల్లా నీరు, భూములతో ప్రాజెక్టు నిర్మాణం ● గోదావరి జలాలు మాత్రం ఖమ్మం జిల్లాకా.. ● ‘చలో పూసుగూడెం’లో బీఆర్‌ఎస్‌ నేతలు ● పిండప్రదానం చేయకుండా అడ్డుకున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘పరాయి ప్రాంతం వాడు ద్రోహం చేస్తే తరిమి కొడతామని, ఈ ప్రాంతం వాడు ద్రోహానికి పాల్పడితే వంద అడుగుల గొయ్యి తీసి పాతిపెడతా’మని కాళోజీ చెప్పిన సూక్తికి తగ్గట్టుగా జిల్లాకు అన్యాయం చేయాలని చూస్తే ఇక్కడి కాంగ్రెస్‌ నేతలను ప్రజలు బొంద పెడతారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్‌ రేగా కాంతారావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సాగునీరు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ చేపట్టిన ‘కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పిండ ప్రదానం – ఛలో పూసుగూడెం’ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీతారామ నీళ్లు ఖమ్మం జిల్లాకు ఇస్తే తమకు సంతోషమేనని, అయితే అంతకంటే ముందు భద్రాద్రి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాకు న్యాయం జరిగే వరకూ దశల వారీగా పోరాటం కొనసాగుతుందన్నారు. ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులు చేయడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. చండ్రుగొండ మండలంలో చేపట్టే ప్యాకేజీలో రైతులకు పరిహారం ఇవ్వకుండా భూ సేకరణ ప్రయత్నం సరికాదన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..సీతారామ ప్రాజెక్టులో జిల్లాకు నీరు ఇవ్వకుండా ఖమ్మం తరలించుకుపోతున్నారని అన్నారు. జిల్లాకు న్యాయం చేసేవరకూ తమ పోరాటం ఆగదన్నారు.

‘ఇల్లెందు’కు అనుమతి ఇవ్వాలి

సీతారామ ప్రాజెక్టుకు గతంలో ఇల్లెందు నియోజకర్గంలోని రోళ్లపాడులో శంకుస్థాపన జరిగిందని, అక్కడి నుంచి ప్రాజెక్టును ఇతర ప్రాంతానికి తీసుకెళ్లినా అప్పటి ఎమ్మెల్యే నోరు మెదపలేదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌ అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లెందు కోసం రూ.3,200 కోట్లతో డీపీఆర్‌ సిద్ధం చేయించానని, ఆర్థిక శాఖ వద్ద ఫైల్‌ పరిశీలనలో ఉండగా ప్రభుత్వం మారిందని, దానికి మంజూరు తేవడంలో ప్రస్తుత ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు.. నిరసన కార్యక్రమాలను అణచివేయడంపై కాకుండా ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి పెడితే బాగుంటుందని బీఆర్‌ఎస్‌ నేత రాకేశ్‌రెడ్డి సూచించారు.

దమ్మపేట రోడ్డులో ట్రాఫిక్‌ జామ్‌

బీఆర్‌ఎస్‌ చేపట్టిన నిరసన, పోలీసుల అడ్డగింత, అరెస్టులతో ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాల్వంచ – దమ్మపేట రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. రెండు వైపులా కిలోమీటర్‌ మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. నేతల అరెస్ట్‌తో వారు వచ్చిన వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉండటం, పోలీస్‌ బారికేడ్లతో ట్రాఫిక్‌ క్లియరెన్స్‌కు కొంత సమయం పట్టింది. మరోవైపు పూసుగూడెం పంప్‌హౌస్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని లోపలికి ఎవరినీ వెళ్లకుండా అడ్డుకున్నారు. అరెస్ట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ నేతలను మధ్యాహ్నం 12 గంటలకు పాల్వంచ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా కార్యకర్తలు స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ములకలపల్లి మండల బీఆర్‌ఎస్‌ నాయకులు మోరంపూడి అప్పారావు, తాండ్ర రాంబాబు, శనగపాటి సీతారాములు, పుష్పాల చందర్‌రావు, కోండ్రు సుందర్‌రావు, సున్నం లలిత తదితరులు పాల్గొన్నారు.

తండ్రి పోలీస్‌ డ్యూటీ.. కూతురు అరెస్ట్‌

ములకలపల్లి : తండ్రి ములకలపల్లి పోలీస్‌స్టేషనల్లో తండ్రి ఒగ్గెల లక్ష్మణ్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా బీఆర్‌ఎస్‌ చేపట్టిన ‘చలో పూసుగూడెం’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కూతురు పూజను అరెస్ట్‌ చేసి అదే స్టేషన్‌కు తరలించారు. అయితే విధి నిర్వహణలో భాగంగా అరెస్టయిన కూతురి వివరాలు సేకరిస్తూ రికార్డు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement