
కొరవడిన చెత్తశుద్ధి !
ముందస్తుగా ఇంటిపన్ను చెల్లిస్తే రాయితీ ఇస్తామంటూ ఎర్లీబర్డ్ పథకాలు.. కొత్తగా ఇల్లు కట్టాలంటే అనుమతి పేరుతో ఫీజు వసూళ్లు.. ఇంటిపన్ను, నల్లా పన్ను, లైబ్రరీ సెస్.. ఇలా అనేక పేర్లతో పన్నులు విధిస్తున్న ప్రభుత్వం.. మున్సిపాలిటీల్లో సమస్యలపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. జిల్లాలోని ఏ పట్టణంలో చూసినా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడం, డ్రెయినేజీల్లో పూడిక తీయక భరించరాని దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల నుంచి తడిచెత్త, పొడిచెత్త సేకరించే వాహనాలు నెలకు ఒకటి, రెండు సార్లు మాత్రమే వస్తున్నాయి. మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు లేకపోగా, అధికారులు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇక వర్షాలు ఉధృతమైతే ఈ సమస్య మరింతగా పెరుగుతుందని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. రోడ్లపై చెత్త, డ్రెయినేజీల్లో సిల్ట్ పేరుకుపోతే దోమలు వృద్ధి చెందుతాయని, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు తప్పవని భయపడుతున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో పేరకుపోయిన సమస్యలపై సాక్షి ఫోకస్..
● చెత్త సేకరణ ఊసేలేదు
పాల్వంచ: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. నిత్యం చెత్త సేకరణకు రావాల్సిన స్వచ్ఛ ఆటోలు వారికి ఒకటి, రెండు సార్లు కూడా రావడం లేదు. దీంతో ఇళ్లలో రోజుల తరబడి చెత్త నిల్వ చేయలేక స్థానికులు వీధుల్లో పడేస్తుండగా కుప్పలుగా పేరుకుపోతోంది. ప్రధాన వీధుల్లో మాత్రమే చెత్త తొలగిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఇతర కాలనీలవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇక డ్రెయినేజీల్లో మురుగు తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. సీతారాం పట్నం, బొల్లేరుగూడెం ఏరియాల్లో డ్రెయినేజీల పక్కన పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి వాటి ఆనవాళ్లే కనిపించడం లేదు.
డ్రెయినేజీ ఆనవాళ్లే కనిపించడం లేదు
డ్రెయినేజీలకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి వాటి ఆనవాళ్లు కనిపించడం లేదు. వాటిలో మురుగు తొలగించక చాలా నెలలైంది. వర్షాలు పెరిగితే మా ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సీతారాంపట్నంలోని అన్ని వీధుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు చర్యలు తీసుకోవాలి.
– పోటు శ్రీనివాసరావు, సీతారాంపట్నం

కొరవడిన చెత్తశుద్ధి !

కొరవడిన చెత్తశుద్ధి !

కొరవడిన చెత్తశుద్ధి !