ఇల్లెందు: ఇందిరమ్మ రాజ్యంలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇల్లెందులో రూ.37.50 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆస్పత్రి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇల్లెందు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా ఆస్పత్రి నిర్మిస్తున్నామని, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు కూడా భూమిపూజ జరగాల్సి ఉండగా, ఆ స్థలం తనదంటూ ఓ రైతు కోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా నిలిచిపోయిందని చెప్పారు. ఆ రైతు వెనక ఉన్న కొందరు ‘పెద్దలు’ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, వారి కలలు కల్లలే అవుతాయని అన్నారు. కాస్త ఆలస్యం కావచ్చే తప్ప ప్రతిపక్షాల కాకిగోలతో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకూ అండగా నిలవాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగాలు, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, రైతులు, దళిత, మైనార్టీ వర్గాల వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
పూబెల్లిలో 83 ఇళ్లకు శంకుస్థాపన..
ఇల్లెందురూరల్: మండలంలోని పూబెల్లి గ్రామంలో 83 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఇంకా ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి మామిడిగుండాల వరకు రూ.4.46 కోట్లతో, రొంపేడు చెక్‌పోస్టు నుంచి మిట్టపల్లి వరకు రూ.3 కోట్లతో, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బోయితండా వరకు రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు సైతం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల వారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి పొంగులేటితో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించారు. సీలింగ్ భూములకు పట్టాలివ్వాలని మామిడి గుండాల గ్రామస్తులు విన్నవించారు. మసివాగుపై వంతెన లేక వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నామని బోయితండా వాసులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, డీఆర్డీఓ విద్యాచందన, మార్కెట్ చైర్మన్ బానోత్ రాంబాబు, ఆర్‌డీఓ మధు, ఆర్‌అండ్‌బీ ఈఈ వడ్లమూడి వెంకటేశ్వరరావు, టీఎంఐడీసీ డీఈ విద్యాసాగర్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి. రవిబాబు, ఇల్లెందు ఆస్పత్రి సూపరింటెండెంట్ హర్షవర్దన్, నాయకులు డి.వెంకటేశ్వరరావు, మేకల మల్లిబాబుయాదవ్, పులి సైదులు, మెట్టెల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
ఇల్లెందులో 100 పడకల ఆస్పత్రి పనులకు శంకుస్థాపన
హాజరైన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ, అధికారులు