గెలుపోటముల్లో హ్యాట్రిక్‌! | Sakshi
Sakshi News home page

గెలుపోటముల్లో హ్యాట్రిక్‌!

Published Fri, Nov 10 2023 12:34 AM

- - Sakshi

● మధిరలో మూడేసి సార్లు ఓడి, గెలిచిన బోడేపుడి ● మూడుసార్లు గెలిచిన భట్టి, ఓడిన కమల్‌రాజు

మధిర: మధిర శాసనసభ్యులుగా సీపీఎం నుంచి గెలుపొందిన బోడేపుడి వెంకటేశ్వరరావు మూడుసార్లు ఓడిపోయిన అనంతరం మూడుసార్లు విజయం సాధించారు. మధిర మండలం తొండల గోపవరానికి చెందిని బోడేపుడి వెంకటేశ్వరరావు వైరా మండలం గండుగులపాడులో స్థిరపడ్డారు. 1967 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా బోడేపుడి వెంకటేశ్వరరావు తొలిసారి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి దుగ్గినేని వెంకయ్య చేతిలో 10,404 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1972లో ఎన్నికల్లో దుగ్గినేని వెంకట్రావమ్మ చేతిలో 17,342 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆతర్వాత 1983లో మళ్లీ సీపీఎం నుంచి పోటీకి దిగిన బోడేపుడి వెంకటేశ్వరరావు పోటీ చేసినా కాంగ్రెస్‌ అభ్యర్థి శీలం సిద్ధారెడ్డిపై చేతిలో 11,187 ఓట్ల తేడాలో ఓటమి ఎదుర్కొన్నారు. అయితే, టీడీపీలో సంక్షోభంతో అప్పటి సీఎం ఎన్టీఆర్‌ అసెంబ్లీని రద్దు చేయగా, 1985 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన బోడేపుడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి శీలం సిద్ధారెడ్డిపై 9,068 ఓట్లతో తొలిసారిగా విజయం దక్కించుకున్నారు. అనంతరం 1989 ఎన్నికల్లో బోడేపుడి సీపీఎం అభ్యర్థిగా రెండోసారి శీలం సిద్ధారెడ్డిపై 7,027 ఓట్ల తేడాతో గెలవగా, 1994 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో మళ్లీ సిద్ధారెడ్డిపైనే 9,161 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సీపీఎం శాసనసభ పక్ష నేతగా కొనసాగిన బోడేపూడి 1997 ఆగస్టు 5న మృతి చెందారు. నాలుగు సార్లు ఓడిపోయినా, మళ్లీ వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ లిఖించిన ఆయన రైతు బాంధవుడుగా మధిర నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా, బోడేపూడిని ఓసారి ఓడించిన సిద్ధారెడ్డి వరుసగా మూడుసార్లు ఆయన చేతిలో ఓడిపోవడం గమనార్హం.

ఒకరి గెలుపు.. మరొకరి ఓటమి

2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క 1,417 ఓట్ల స్వల్ప ఓట్ల మెజార్టీతో సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌పై మొదటిసారిగా విజయం సాధించారు. అలాగే, 2014లో ఎన్నికల్లో వీరిద్దరు మళ్లీ పోటీ చేయగా భట్టి 12,468 ఓట్ల మెజార్టీతో రెండో సారి గెలుపు దక్కించుకున్నారు. మళ్లీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి మల్లు భట్టివిక్రమార్క, బీఆర్‌ఎస్‌ నుంచి కమల్‌రాజ్‌ పోటీ పడగా 3,567 ఓట్ల మెజార్టీతో భట్టినే విజయం వరించింది. ఇలా మధిర నియోజకవర్గంలో ‘హ్యాట్రిక్‌’ జయాపజయాలు ప్రత్యేక స్థానం సాధించాయి. ఈ ఎన్నికల్లోనూ వీరిద్దరు పోటీ పడుతుండగా, ఎవరిని విజయం వరిస్తుందనే చర్చ జరుగుతోంది.

బోడేపుడి 
వెంకటేశ్వరరావు
1/3

బోడేపుడి వెంకటేశ్వరరావు

మల్లు 
భట్టి విక్రమార్క
2/3

మల్లు భట్టి విక్రమార్క

లింగాల 
కమల్‌రాజు
3/3

లింగాల కమల్‌రాజు

Advertisement
 
Advertisement