
గోదావరి ఒడ్డు నుంచి స్నానఘట్టాల ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ అనుదీప్
దుమ్ముగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల దేవాలయంలో ఈ నెల 30న జరిగే శ్రీరామనవమికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. మంగళవారం పర్ణశాలలో అధికారులతో నవమి ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. తొలుత గోదావరి వద్ద స్నానఘట్టాల ఏర్పాట్లను పరిశీలించారు. నదిలో స్నానానికి వెళ్లే భక్తులకు ప్రమాదాలు జరగకుండా అప్రమత్తం చేయాలని, మహిళలకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ నెల 31 గవర్నర్ తమిళిసై పర్ణశాలలో కూడా పర్యటిస్తారని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఆలయానికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న షాపులను తొలగించాలని సూచించారు. కల్యాణ మండపం ఏర్పాట్లను పరిశీలించి, క్లాత్ డెకరేషన్ త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించాలని, విద్యుత్ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ రమాకాంత్, ఇరిగేషన్ అధికారులు రాంప్రసాద్, నాగేశ్వరరావు, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ చంద్రమౌళి, సీఐ రమేష్, ఎంపీఓ ముత్యాలరావు, ఇతర అధికారులు లక్ష్మయ్య, ఆదినారాయణ, రాజు సుహాస్, ఏసుబాబు, రాము, డాక్టర్ రేణుక పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్