
పాల్వంచరూరల్: మండల పరిఽధిలోని కేశవా పురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలు వుదీరిన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి సోమవారం శ్రీచక్రార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అలాగే, శ్రీదేవీ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజున అమ్మవారికి అర్చకులు, రుత్విక్‌లు మల్లెపూలతో లక్ష కుసుమార్చన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, నాదనీరాజనం, నివేదన, హారతి, నీరాజన మంత్రపుష్పం, వేదగోష్టి తదితర పూజలు జరిపించారు.
సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాల వితరణ
చర్ల: మండలంలోని కలివేరులో ఉన్న సీఆర్పీ ఎఫ్ 151 బెటాలియన్, 204 కోబ్రా బెటాలియన్ విభాగాల సిబ్బంది సోమవారం ఆదివాసీలకు వితరణ చేశారు. సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పామేడు, ధర్మారం గ్రామాల్లో ఆదివాసీలకు దుస్తులు, వాటర్ ఫిల్టర్లు, దోమతెరలు, యువకులకు క్రీడా సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ధర్మారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు పి.కె. సింగ్, అయోధ్యసింగ్ మాట్లాడుతూ ఆదివాసీల అభ్యున్నతికి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉద్యోగ భద్రతకు పోరాడాలి
సింగరేణి(కొత్తగూడెం): ఉద్యోగ భద్రతకు పోరాడాలని ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి జి.అనురాధ పేర్కొన్నారు. సోమవారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని వివిధ కార్మికుల అడ్డాల్లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లలో ఆమె మాట్లాడారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకు కట్టబెట్టొద్దని డిమాండ్ చేశారు. పర్మనెంట్ కార్మికులతో చేయించాల్సిన పనులను కాంట్రాక్ట్ కార్మికులతో చేయిస్తున్నారని, అయినా వారికి సరైన జీతభత్యాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. వచ్చే నెల 2,3 తేదీల్లో కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించే ఇఫ్టూ సభలను జయప్రదం చేయాలని కోరారు.


అమ్మవారికి లక్ష కుసుమార్చన చేస్తున్న అర్చకులు