చీరాల రూరల్: చినగంజాం మండలంలోని అన్ని సివిల్, క్రిమినల్ కేసులను పర్చూరు కోర్టుకు తరలించవద్దంటూ చీరాల న్యాయవాదులు ముక్తకంఠంతో హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించి, కేసుల తరలింపు నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ వినతి పత్రాలు సమర్పించారు. గురువారం రెండు మినీ బస్సుల్లో చీరాల న్యాయవాదులు హైకోర్టుకు తరలివెళ్లారు. చీరాల కోర్టుల్లోని చినగంజాం మండల కేసులను పర్చూరు కోర్టుకు తరలించవద్దంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రార్ వీఎస్‌ఎస్ శ్రీనివాస శర్మకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు పన్నెం మల్లికార్జునబాబు, బండారుపల్లి హేమంత్‌కుమార్, ఎంవీ చలపతిరావు, టీజే సాయిబాబు, మిక్కిలి పుల్లయ్య, గౌరవ రమేష్‌బాబు, పోతిన సుధాకర్‌లు సమస్యను న్యాయమూర్తులకు వివరించారు. కొన్నేళ్లుగా చినగంజాం మండలంలోని అన్ని సివిల్, క్రిమినల్ కేసులు చీరాల కోర్టుల్లోనే విచారణ చేస్తున్నారని, ఈ కేసులన్నింటినీ పర్చూరు కోర్టులకు తరలింపు ప్రక్రియ చేపట్టారని వారు న్యాయమూర్తుల దృష్టికి తీసువెళ్లారు. ఆ విధంగా జరిగితే చినగంజాం మండలంలోని అన్ని గ్రామాల కక్షిదారులు ఎంతో ఇబ్బందులు పడతారని, ఆయా గ్రామాల నుంచి పర్చూరు వెళ్లేందుకు కనీసం బస్సు సౌకర్యం లేదని, సుమారుగా 60 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుందని వారు న్యాయమూర్తులు దృష్టికి తీసుకెళ్లారు. అదే గనుక చీరాల కోర్టుకు ఆయా గ్రామాల కక్షిదారులు 20 కిలో మీటర్లు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పారు. కక్షిదారులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చినగంజాం మండల కేసులన్నింటినీ చీరాల కోర్టుల్లో యథాతథంగా ఉంచాలని వారు న్యాయమూర్తులకు విన్నవించారు. అయితే సమస్యలన్నింటినీ సావధానంగా ఆలకించిన న్యాయమూర్తులు సమస్యను ఉన్నత న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తామని న్యావాదులకు హామీ ఇచ్చారు. హైకోర్టుకు తరలివెళ్లినవారిలో ఆకిశెట్టి పుల్లయ్య, రావుల రమేష్‌కుమార్, పుల్లెల హరిబాబు, అనిశెట్టి రాంబాబు, కాజా సుబ్రహ్మణ్యం, కార్యంపూడి ప్రసాద్, అందె వెంకటేశ్వర్లు, మంకెన అశోక్, మేరుగ రవి, షేక్ సిరాజ్, కామేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, మహిళా న్యాయవాదులు శకుంతల, యానిగ్రేస్, కల్పన, పావని ఉన్నారు.
చినగంజాం కేసులను పర్చూరు
కోర్టుకు తరలించవద్దంటూ హైకోర్టు
న్యాయమూర్తులకు వినతి
పరిశీలించి నిర్ణయం
తీసుకుంటామని జడ్జీలు హామీ


