నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు సామాన్యులపై భారం మోపుతున్న కూటమిపై మండిపాటు పెద్ద ఎత్తున కదిలివచ్చిన శ్రేణులు అధికారులకు వినతిపత్రాలు
ఇబ్బడిముబ్బడిగా పెరిగిన బియ్యం, కందిపప్పు, వంట నూనెలు వంటి నిత్యావసర ధరలు సామాన్యుల జేబులు ఖాళీ చేయగా.. దొరకడమే గగనమైన గ్యాస్ బండ నెత్తిన పిడుగులా మారగా.. ఆకాశాన్నంటిన కూరగాయల ధరలతో కుదేలై కుటుంబ పోషణ కష్టంగా మారి, ఏం తినేటట్లు లేం.. ఏం కొనేటట్లు లేమంటూ.. చస్తూ, బతుకుతూ, బతుకీడుస్తున్న సామాన్యుడిపై తాజాగా కూటమి ప్రభుత్వం ‘పెట్రో’ ధరల బాంబు వేసింది. దీనిపై వైఎస్సార్ సీపీ సామాన్యుడి తరఫున గళం వినిపించింది. వైఎస్సార్ సీపీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దెబ్బకు పెరిగిన నిత్యావసరాలతో సామాన్యుడి బతుకు దుర్భరం అయిందని, పెరిగిన ‘పెట్రో’ ధరలతో వారు మరింత కుదేలయ్యారని, వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇంధన ధరల రూపంలో సామాన్యులపై కూటమి ప్రభుత్వం పెనుభారం మోపడంపై వైఎస్సార్ సీపీ భగ్గుమంది. అధిష్టానం పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సోమవారం బాపట్ల జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఇంధన ధరలు ఎక్కువని నాయకులు మండిపడ్డారు. పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
కదంతొక్కిన శ్రేణులు
బాపట్ల పట్టణంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్న పెన్షన్లు ఎత్తివేస్తూ, కొత్త పెన్షన్‌లు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోటి రాఘవరెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎం.ఏడుకొండలురెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. తహసీల్దారు సలీమను కలిసి వినతిపత్రం అందజేశారు.
పర్చూరు బొమ్మల సెంటర్ వద్ద నిరసన తెలియజేస్తున్న
వైఎస్సార్ సీపీ నాయకులు
రేపల్లెలో ఎడ్ల బండిపై ద్విచక్రవాహనాన్ని ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తున్న సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణ, పార్టీ శ్రేణులు
చీరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు బసవ పున్నారెడ్డి, నాయకులు, కార్యకర్తలు
బాపట్లలో రిక్షా తొక్కి నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్‌బాబు, నాయకులు


