కాపుల వార్డులను అడ్డంగా చీల్చి..
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 57 డివిజన్లను 76 డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధికార పార్టీ నేతలకు అనుకూలంగా మారిందనే చెప్పుకోవచ్చు. డివిజన్ల/వార్డులు పునర్విభజన ప్రక్రియ గత నెల రోజులపై నుంచి జరుగుతున్నప్పటికీ దీనిని ప్రభుత్వం రెండుసార్లు వాయిదా వేసింది. ఈ క్రమంలో మూడోసారి డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదా సోమవారం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు విడుదల చేశారు. అయితే ఈ ప్రతిపాదిత ముసాయిదాలో అధికార పార్టీ నేతలకు అనుకూలంగానే ఉందే తప్ప.. ప్రజలకు ఉపయోగకరంగా లేదని నగర వాసులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
నెల రోజుల ముందే ఎమ్మెల్యేల దగ్గరకు మ్యాపు!
వార్డుల పునర్విభజనకు సంబంధించిన మ్యాపు నెల రోజుల క్రితమే ఎమ్మెల్యేల వద్దకు, టీడీపీ లోని ముఖ్య నాయకులకు వద్దకు చేరింది. దీని ఆధారంగా వార్డుల పునర్విభజనకు తమకు అను కూలంగా ఉండేవిధంగా రోజుకు ఒక డివిజన్ నాయకులను ఎమ్మెల్యేల కార్యాలయాలకు పిలిపించుకుని అక్కడే పెద్ద స్క్రీన్లలో మ్యాపు క్షుణ్ణంగా చూపిస్తూ మీకు అనుకూలంగా ఉందా.. లేదా అని అడిగి తెలుసుకుని మరి వారి అభిప్రాయాలను సేకరించారని అధికారులపై ఆరోపణ. ఆ మ్యాపు అనధికారికంగా బయటకు రావడంపై వివిధ రాజకీయ పార్టీలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు నగర కమిషనర్ మయూర్ అశోక్‌ని కలిసి అనధికార మ్యాపుపై ఫిర్యాదు కూడా చేశారు. సదరు మ్యాపు అధికారికంగా రాలేదని.. వార్డుల పునర్విభజన ప్రక్రియ శాసీ్త్రయంగా చేపడతామని చెప్పినప్పటికీ పట్టణ ప్రణాళిక అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి గతంలో అనధికారికంగా బయటకు వచ్చిన మ్యాపునకు ఇప్పుడు కొంచెం అటు ఇటు మార్పులు చేసి తామోదో కొత్తగా వార్డుల మ్యాపును ఇచ్చామని ప్రగల్భాలు పలకుతున్నారని రాజకీయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
నగరంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే వార్డులను కూడా అధికార పార్టీ నేతలు కావాలనే అధికారులను అడ్డంపెట్టుకుని చీల్చారని కాపు నేతలు ఆరోపిస్తున్నారు. కాపులు ఎక్కువగా ఉన్న డివిజన్లను అడ్డగోలుగా చీల్చి అక్కడ వారి ప్రాధాన్యతను తగ్గించడంతో పాటు టీడీపీలో ఉన్న ఇతర సామాజిక వర్గాల వారికి అగ్రతాంబూ లం కల్పించేందుకు అడ్డగోలుగా చీల్చారాని కాపు నాయకులు మండిపడుతున్నారు. ఈ నెల 24వ తేదీవరకు అభ్యంతరాల స్వీకరణ ఉండటంతో కాపు నాయకులతో పాటు.. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలను లేవనెత్తేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
నగరంలో అశాసీ్త్రయంగా డివిజన్ల విభజన


