బాపట్లటౌన్: బ్యాంక్‌లో ఉన్న బంగారం విడిపించి ఇస్తానని నమ్మబలికి ఓ వ్యక్తి నుంచి రూ. 17 లక్షలు లాక్కొని పరారైన ఘరానా దొంగల ముఠాను వెదుళ్లపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈమేరకు బాపట్ల డీఎస్పీ సిహెచ్ చంద్రమౌళి సోమవారం వివరాలు వెల్లడించారు. బాపట్ల మండలం, స్టువార్టుపురం గ్రామానికి చెందిన అంగడి గౌతమ్ అలియాస్ బ్రూస్లీ తన బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టానని, వాటిని విడిపించకపోతే వేలం వేస్తారని, వాటిని విడిపించేందుకు రూ. 17 లక్షలు నగదు కావాలని, విడిపించిన బంగారం మీకు అప్పగిస్తానంటూ చీరాల మండలం, గవినివారిపాలెం గ్రామానికి చెందిన దబ్బకూటి నానిని నమ్మబలికారు. గౌతమ్ మాటలు నమ్మిన దబ్బకూటి నాని ఈనెల 8వ తేదీన రూ. 17 లక్షలు తీసుకొని వెదుళ్ళపల్లి సెంటర్‌కు చేరుకున్నారు. ముందస్తు పథకం పన్నిన అంగడి గౌతమ్ బాపట్ల మండలం, వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన దేవర నరసింహారావు అలియాస్ చింటూ, పరసా శివప్రసాద్‌లతో కలిసి దబ్బకూటి నాని దగ్గర నుంచి రూ. 17 లక్షల నగదు లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈనెల 9వ తేదీన వెదుళ్లపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు సోమవారం చీరాల మండలం, తోటవారిపాలెం సమీపంలోని వైన్‌షాపు దగ్గర ఉన్న విషయం తెలుసుకొని వారిని అరెస్ట్‌చేశారు. వారిలో అంగడి గౌతమ్ దగ్గర నుంచి రూ. 1000, దేవర నరశింహరావు నుంచి రూ. 14,21,100, పరసా శివప్రసాద్ వద్ద నుంచి రూ. 1200 చొప్పున మొత్తం రూ. 14,22,300 రికవరీ చేశారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన బాపట్ల రూరల్ సర్కిల్ సీఐ బి.హరికృష్ణ, వెదుళ్ళపల్లి ఇన్‌ఛార్జి ఎస్‌ఐ ఎస్.రవీంద్ర, వెదుళ్ళపల్లి ఏఎస్‌ఐ డి.పుష్పారావు, చీరాల క్రైంపార్టీ హెడ్ కానిస్టేబుల్ బి.అచ్చియ్య, చీరాల క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుల్ తన్నీరు శ్రీను, క్రైం పార్టీ కానిస్టేబుల్ బి.బాలచంద్ర, కర్లపాలెం కానిస్టేబుల్ శ్రీనవీన్‌లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


