నరసరావుపేట: విద్యుత్ బస్సుల పేరుతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్‌టీసీ)లో దశలవారీగా ప్రైవేటీకరణ జరుగుతోందని, ఇది సంస్థ భవిష్యత్తు, వేలాది మంది కార్మికుల ఉపాధికి తీవ్ర ముప్పుగా మారుతోందని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, పీజీఆర్‌ఎస్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహకు వినతిపత్రం సమర్పించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ప్రభుత్వ రవాణా వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీని వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతిని, ప్రజలకు అందుతున్న చౌక, నాణ్యమైన రవాణా సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. 26వ తేదీన నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, సంస్థను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ నాగమల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి తిరుపతిరావు పాల్గొన్నారు.


