● అన్నవరం పీఏసీఎస్‌లో
అవినీతిపై ఫిర్యాదులు
● విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
● వెలుగులోకి సీఈవో శ్రీనివాసరావు
అక్రమాలు, వేధింపులు
● సీఈవో వైఖరితో ఉద్యోగి ఆత్మహత్య
● విచారణ నిలిపివేయాలని
సహకార మంత్రికి ఎమ్మెల్యే లేఖ
● అంగీకరిస్తూ చంద్రబాబు
ప్రభుత్వం ఉత్తర్వులు
● పాలకుల తీరుపై అన్నదాతల
తీవ్ర ఆగ్రహం
నరసరావుపేట రూరల్: అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన అవినీతిపై జరుగుతున్న విచారణను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. మూడు దశాబ్దాలుగా అన్నవరం సొసైటీలో తిష్ట వేసిన వ్యక్తి అందినకాడికి దండుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డాడు. వాటిని తట్టుకోలేక గుమస్తా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో మహిళా ఉద్యోగిని కూడా జీతాలు ఇవ్వకుండా వేధించాడు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగి.. సొసైటీలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని విన్నవించారు. దీంతో అక్రమాల డొంక కదిలింది. దీనిని ఆదిలోనే ఆపాలని సదరు ఉద్యోగి ఏకంగా కూటమి ఎమ్మెల్యేతో ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో విచారణను ప్రభుత్వం నిలిపివేసింది.
రొంపిచర్ల మండలం అన్నవరం పీఏసీఎస్ అవినీతిపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు పలు మార్లు ఫిర్యాదులు అందాయి. సొసైటీ పరిధిలోని రైతులతోపాటు సిబ్బంది సైతం అవినీతి గురించి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్... జిల్లా సహకార అధికారిని విచారణకు ఆదేశించారు. సొసైటీ రికార్డులను పరిశీలించి రైతులను అధికారులు విచారించారు. పీఏసీఎస్‌లో అవినీతి నిజమేనని నిగ్గు తేల్చారు. విచారణలో రూ.16.86 లక్షల అవినీతి జరిగిందని నిర్ధారించారు. సెక్షన్ 52 ప్రకారం పూర్తి స్థాయి విచారణకు జిల్లా సహకార అధికారి నాగరాజు ఈ ఏడాది మార్చి 30వ తేదీన ఆదేశించారు. పీఏసీఎస్ సీఈవోగా పనిచేస్తున్న దొప్పలపూడి శ్రీనివాసరావు అవినీతిలో కీలక సూత్రధారి అని అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. శ్రీనివాసరావు భార్య ఉషారాణిని సొసైటీ ఉద్యోగినిగా చూపిస్తూ 2014–19 కాలానికి రూ.6.12 లక్షలు వేతనంగా డ్రా చేశాడు. అయితే ఉషారాణిని కార్యాలయంలో ఎప్పుడూ చూడలేదని విచారణలో అధికారులకు రైతులు తెలిపారు. గతంలో శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయ్యాడు. ఈ కాలానికి కూడా సొసైటీ నుంచి జీతాలు, పాత బకాయిలను సొసైటీ మినిట్ పుస్తకంలోని ఖాళీ పేజీలలో నకిలీ తీర్మానాలు సృష్టించి మొత్తం రూ.8.94 లక్షలు తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. రైతు నుంచి వసూళ్లు చేసిన రూ.1.90 లక్షలను బ్యాంక్‌లో జమ చేయనట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా గతంలో సొసైటీలో పెయిడ్ సెక్రటరీగా పనిచేసిన జేపీ కుమార్‌కు ఇవ్వాల్సిన మొత్తం రూ.3.45 లక్షలను కూడా శ్రీనివాసరావు నకిలీ తీర్మానాలతో డ్రా చేసినట్టు అధికారులు గుర్తించారు.
ఎమ్మెల్యే చదలవాడ అండ
అన్నవరం పీఏసీఎస్‌లో జరిగిన అవినీతిపై పూర్తి స్ధాయి విచారణ జరిగితే మరింత అక్రమాలు వెలుగులోకి వస్తాయని భావించిన సీఈవో శ్రీనివాసరావు... ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబును ఆశ్రయించాడు. సీఈవోపై వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని ఎమ్మెల్యే నేరుగా సహకార శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు ఏప్రిల్ 2వ తేదీన లేఖ రాశారు. దీనిపై స్పందించిన మంత్రి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్నవరం పీఏసీఎస్‌పై విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి వంతు పాడుతూ ఎమ్మెల్యే విచారణ నిలిపివేయాలని కోరడంపై రైతుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


