అభివృద్ధి పనులు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగవంతం

May 14 2026 6:15 AM | Updated on May 14 2026 6:15 AM

అభివృద్ధి పనులు వేగవంతం ● మత్స్యశాఖ పరిధిలో గొంది సముద్రం, అడవిపల్లెపాలెం ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ● జిల్లాలో రోడ్డు భద్రత చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అవసరమైన హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ● అలాగే జిల్లాలో కొనసాగుతున్న రైల్వే సంబంధిత అభివృద్ధి పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఫిషరీస్‌ శాఖ డీడీ గాలిదేవుడు, మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రంగారావు, సోషల్‌ వెల్ఫేర్‌ డీఈ రామ్మోహన్‌, కలెక్టర్‌ కార్యాలయం ఏఓ మల్లికార్జున, ల్యాండ్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శ్రీలక్ష్మి, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌

బాపట్ల: జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖల వారీగా పనుల పురోగతిని పరిశీలించి పలు సూచనలు చేశారు. సామాజిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో కొనసాగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులను వెంటనే వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, మిగిలిన ఎస్‌డబ్ల్యూ హాస్టల్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రేపల్లె ఎస్‌డబ్ల్యూ కళాశాల బాలుర హాస్టల్‌ నిర్మాణ పనులను ప్రాధాన్యంగా పూర్తి చేయాలని తెలిపారు. ఎస్‌డబ్ల్యూ బాలికల హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. బాపట్ల, పర్చూరు హాస్టళ్లలో జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తురుమెళ్లలోని పీఎం అజయ్‌ ఎస్‌డబ్ల్యూ బాలికల హాస్టల్‌ పనులను కూడా నిర్దేశిత ప్రమాణాలతో పూర్తి చేయాలని పేర్కొన్నారు.

ఎంపీ ల్యాడ్స్‌ పనులు 15 రోజుల్లో

ప్రారంభం కావాలి..

ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులన్ని 15 రోజుల్లో ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. ఎంపీ ల్యాడ్స్‌, డీఎంఎఫ్‌ నిధులతో నిర్మిస్తున్న పనులపై జిల్లా కలెక్టర్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలకు 40 ల్యాబ్స్‌ నిర్మించడానికి ఎంపీ ల్యాడ్స్‌ మంజూరైనప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడం ఏంటని కలెక్టర్‌ ప్రశ్నించారు. టెండర్‌ ప్రక్రియ వారం రోజుల్లో ముగించాలన్నారు. మొత్తం మీద 106 అభివృద్ధి పనులు ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టినప్పటికి పనులు మొదలు కాకపోవడంపై ఆరా తీశారు. మార్కెటింగ్‌ శాఖకు 60 గోదాములు మంజూరు కాగా, 30 గోదాములు పూర్తి చేయడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాలుగు గోదాములు రద్దు చేయడంపై ఆరా తీశారు. మంజూరైన వాటిని మిగిలిన ప్రాంతాలకు బదిలీ చేసి గోదాములు నిర్మించాలన్నారు. ఇప్పటివరకు నిర్మించిన గోదాములన్నింటిని సహకార శాఖకు అప్పగించాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్‌ ఏఓ మల్లికార్జునరావు, సీపీఓ షాలేమురాజు, మైన్స్‌ ఏడీ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ, పీఆర్‌ ఈఈ రాజన్‌ బాబు, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు నళిని, అరుణకుమారి, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement