ధర దక్కక.. దుఃఖం తీరక.. | - | Sakshi
Sakshi News home page

ధర దక్కక.. దుఃఖం తీరక..

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

అన్నదాతలకు కన్నీరే మిగిల్చిన చంద్రబాబు ప్రభుత్వం మద్దతు ధరలు దక్కక పెట్టుబడులు కూడా రావని ఆందోళన పేరుకుపోయిన గత ఏడాది పొగాకు నిల్వలు మొక్కజొన్న పంట కొనుగోలుకు కనీస చర్యలూ తీసుకోని సర్కారు

మొక్కజొన్న ఊసే ఎత్తని ప్రభుత్వం..

చివరి ఆకు వరకు కొంటామన్నారు

మద్దతు ధరకు కొనాలి

దళారుల వ్యవస్థతో నాశనం

పుస్తెలు తాకట్టు పెట్టి పెట్టిన పెట్టుబడులు.. బొట్టు బొట్టుగా చెమటోడ్చి రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక కర్షకులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చేసిన సాగులో వరుణ దేవుడు కరుణించడంతో కాస్త దిగుబడులు వచ్చాయి. ఇక తమ కష్టాలు తీరుతాయని భావించిన సమయంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. మద్దతు ధర ప్రకటించినా ఆ మేరకు కొనుగోళ్లు జరిగేలా చంద్రబాబు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడంతో అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి.

కారంచేడు: గతేడాది సాగు చేసిన పొగాకు నేటికీ కర్షకులు ఇంటి వద్దనే దాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గిట్టుబాటు ధరలతో చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎదురు చూసిన రైతులను సర్కారు నిండా ముంచేసింది. చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన పాలకులు మధ్యలోనే చేతులు ఎత్తేశారు. దీంతో సాగు చేసిన పంటలో కేవలం 50–60 శాతం వరకు మాత్రమే కొనుగోలు చేశారని, మిగిలిన పొగాకు నేటికీ రైతుల ఇళ్ల వద్ద ఉందని ఆరోపిస్తున్నారు. నేటి ఆ పంటను తిరగ తిప్పుకోవడానికి, కాపలా కోసం ఎదురు పెట్టుబడులు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పొగాకు సాగు కోసం పెట్టిన రూ.లక్షలు పెట్టుబడులు కనీసం వస్తాయా.. రావా... అని ఆందోళన చెందుతున్నారు. చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన నాయకులు ఇప్పటికై నా తమ గోడు పట్టించుకోవాలని వేడుకుంటున్నారు.

దళారుల ఇష్టారాజ్యం..

చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యకపోవడంతోనే దళారులు తమకు ఇష్టమైన ధరలు నిర్ణయించుకుని దోపిడీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధరగా రూ.2,400 ప్రకటించినప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో దళారులు కేవలం రూ.1650–1700 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ ధరకు ఇస్తే ఇవ్వండి.. లేకుంటే లేదు.. అనే ధోరణిలో మొక్కజొన్న కొనుగోళ్లు సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే తమకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని కోరుతున్నారు.

పెట్టిన పెట్టుబడులకు గ్రహణమేనా..

ఈ ఏడాది ప్రభుత్వం మాటలు నమ్మి సాగు చేసిన మొక్కజొన్న కొనుగోళ్లు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మొక్కజొన్న సాగుకు కౌలు ధరలతో కలిపి రూ.60 వేల నుంచి రూ. 70 వేల వరకు పెట్టుబడులు పెట్టామని రైతులు చెబుతున్నారు. దిగుబడులు మాత్రం సుమారు 35 – 40 క్వింటాళ్లు వచ్చాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం దళారులు కేవలం రూ.1600 చొప్పున కొనుగోలు చెయ్యడం వలన పెట్టుబడులకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదముందన్నారు. అదే ప్రభుత్వ గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేస్తే ఎకరానికి పెట్టుబడులు పోను రైతు కష్టానికి సుమారు రూ.20 వేల వరకు మిగులుతాయని చెబుతున్నారు.

గత ఏడాది ఎక్కువ మంది రైతులు పొగాకు సాగు చేశారు. ఈ ఏడాది ఆ తప్పు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందుగానే ఎవరూ సాగు చేయవద్దని చెప్పింది. ప్రత్యామ్నాయ పంటలనే సాగు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పర్చూరు నియోజకవర్గంలోని కారంచేడు, పర్చూరు, ఇంకొల్లు, యద్దనపూడి మండలాల్లో అధికంగా మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించాయి. రైతులు ఊహించిన దానికంటే ఎక్కువగానే దిగుబడులు వచ్చాయి. సంతోషించాల్సిన సమయంలోనే మొక్కజొన్నను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైతులు వేదన చెందుతున్నారు.

నేను కారంచేడు ప్రాంతంలో అప్పులు చేసి సుమారు 40 ఎకరాల్లో గత ఏడాది పొగాకు సాగు చేశా. నాటి కూటమి పెద్దలు చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తాం.. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. నేడు అదే పాలకులు ముఖం చాటేశారు. ఇప్పటికీ రైతుల వద్ద 40 శాతానికిపైగా పొగాకు ఉంది. నా వద్ద సుమారు రూ.50 లక్షల విలువైన పొగాకు నిల్వలున్నాయి.

– యార్లగడ్డ సుబ్బారావు, రైతు

నేను రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఎకరానికి సుమారు అన్ని ఖర్చులతో కలిపి రూ.60 వేలు నుంచి రూ. 70 వేల వరకు ఖర్చు అయ్యింది. దిగుబడులు బాగున్నాయి. ఎకరానికి సుమారుగా 35–40 బస్తాల వరకు వచ్చాయి. ధరలు మాత్రం చాలా తక్కువగా అడుగుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి.

– నూతి రంగనాయకులు చౌదరి, రైతు

ఈ ఏడాది మొక్కజొన్న సాగుతో మంచి దిగుబడి చాలా సంతోషంగా ఉంది. మద్దతు ధరలు లేవు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను దళారులు రూ. 2400 ఉంటే, దళారులు మాత్రం కేవలం రూ.1600 కే అడుగుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

– దండూరి అప్పయ్య, కౌలు రైతు

Advertisement
 
Advertisement
Advertisement