ఆంఽధ్రప్రదేశ్‌ అభివృద్ధి మంత్రం మావిగన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆంఽధ్రప్రదేశ్‌ అభివృద్ధి మంత్రం మావిగన్‌

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

● మాజీ మంత్రి అంబటి రాంబాబు ● చంద్రబాబుకు రాజకీయ పరిజ్ఞానం, అభివృద్ధిపై పట్టులేదని విమర్శ

చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి మంత్రం ‘మావిగన్‌’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రి విడదల రజిని నివాసంలో ఆమెతో కలసి అంబటి రాంబాబు శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నేడు రాష్ట్రమంతటా వైఎస్సార్‌ సీపీ అధినేత ప్రతిపాదించిన మావిగన్‌ గురించే ముమ్మరంగా చర్చించుకుంటున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లెక్కల ప్రకారం అమరావతి రాజధాని పూర్తి చేసేందుకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇది ఏ మాత్రం పూర్తి చేయలేని పథకం అని వివరించారు. ప్రొఫెసర్‌ రామచంద్రయ్య అమరావతి గురించి మాట్లాడుతూ తాను ప్రపంచంలో ఎన్నో పట్టణాలు చూశానని, అయితే అమరావతి వంటి పట్టణాన్ని చూడలేదని తెలిపినట్లు పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన మాటల ప్రకారం ఎక్కడైనా నదుల నుంచి నీటిని తోడి చెరువులకు పెడతారని, అమరావతిలో మాత్రం నీళ్లు తోడి నదిలో పోయాల్సి వస్తున్నదని తెలిపినట్లు చెప్పారు. అమరావతి లోతట్టు ప్రాంతమని, అది పూర్తయ్యే అవకాశం ఏ మాత్రం లేదని చెప్పారు. అమరావతిని మార్చడానికి వీలులేకుండా ఎందుకు చట్టం తెచ్చారని ప్రశ్నించారు. మీరు తిరిగి అధికారంలోకి రాలేమనే నమ్మకమా? లేక మీరు చట్టం చేస్తే భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేవారు చట్టం మార్చలేరనా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు రాజకీయ పరిజ్ఞానం ఉందని భావించే వారు అమాయకులని వెల్లడించారు. రాజకీయ పరిజ్ఞానం, అభివృద్ధిపై పట్టు ఉంటే గుంతలో రాజధాని ఎందుకు పెడతారని ప్రశ్నించారు. వర్షం వస్తే నిండిపోయే చెరువులాంటి అమరావతిలో రాజధాని ఎందుకు కడతారని నిలదీశారు. కేవలం స్వార్థం, డబ్బు సంపాదన, కొడుకును అధికారంలోకి తీసుకురావాలనే కోరికతోనే ఇలాంటి పనులకు పాల్పతున్నారని ఆరోపించారు. అమరావతి పూర్తి అయ్యే ప్రాజెక్టు కాదని, అది మనల్ని అగాథంలోకి దించే ప్రాజెక్టు అని అభివర్ణించారు.

పోలీసుల తీరు అమానుషం

రాష్ట్రంలో పోలీసుల తీరు అమానుషంగా ఉందని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులు సంఘాన్ని హింసిస్తున్నారని పేర్కొన్నారు. మార్చి 31వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు తిరుపతిలో తంబిరెడ్డిని మఫ్టీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను చితక్కొట్టి, హైకోర్టులో హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాక మాత్రమే కోర్టులో హాజరు పరిచారని తెలిపారు. తన ఇంటిపై 7 గంటల 20 నిమిషాల పాటు టీడీపీ దుండగులు దాడి చేస్తే.. జిల్లా ఎస్పీ ఆ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిపై నామమాత్రపు కేసు నమోదు చేసి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారని గుర్తుచేశారు. తనను మాత్రం 18 రోజుల పాటు జైలులో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారుల తీరు ఏ మాత్రం సరిగా లేదని, అలాంటి వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిందో ఇటీవల నరసరావుపేట ఎస్పీ కార్యాలయం లోపలివైపు నుంచి టీడీపీ ఎమ్మెల్యే తాళం వేసిన సంఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఈ సంఘటనలో స్వయంగా పోలీసు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి వచ్చి తలుపులు పగలగొట్టించాల్సి రావడం హాస్యాస్పందంగా ఉందన్నారు. తనపైన, మాజీ మంత్రి విడదల రజినిపైన, పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైన అనేక తప్పుడు కేసులు పెట్టారని వివరించారు. అయితే ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. న్యాయపోరాటంతోపాటు ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. అరాచక పాలన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చి వేస్తామని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement