మాచర్ల: పట్టణంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లను గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, చెన్నకేశవాచార్యులు, ఈఓ ఐ. సైదారావుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కొమెర అనంతరాములు, ఈఓ ఆధ్వర్యంలో రాత్రి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు దంపతులు పాల్గొన్నారు.
కాపాడిన స్థానికులు
వేటపాలెం: మండల కేంద్రం వేటపాలెంలో జింక పిల్ల ప్రత్యక్షం అయింది. ఈ జింక పిల్లను కుక్కలు తరుముకుంటూ వచ్చాయి. వాటి నుంచి తప్పించుకున్న జింక రైల్వే ట్రాక్ దగ్గరలోని సమైక్యనగర్ ప్రాంతానికి వచ్చింది. గమనించిన స్థానికులు వెంటనే కుక్కలను తరిమేశారు. అప్పటికే జింక వెనుక కాళ్ల వద్ద కుక్కలు కరిచాయి. స్థానికులు దానిని రిక్షాపై పశువైద్యశాలకు తరలించారు. అటవీశాఖ అధికారులకు అప్పగించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంపై కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. జింక పిల్ల వేటపాలెం రావడం ఇదే మొదటి సారి కావడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు.
జూనియర్ సివిల్ జడ్జిగా బాపట్ల వాసి ఎంపిక
బాపట్ల టౌన్: గతేడాది నిర్వహించిన జ్యూడీషియల్ పరీక్ష ఫలితాలను గురువారం రాత్రి రాష్ట్ర హైకోర్టు వెలువరించింది. ఫలితాల్లో బాపట్ల పట్టణం, ఇమ్మడిశెట్టివారిపాలెంకు చెందిన ఇమ్మడిశెట్టి యలమందరావు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. యలమందరావు బాపట్లలోని జేమ్స్ స్కూల్‌లో 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్‌నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీని ఒంగోలులోని ఐపీఎస్‌సీ లా కళాశాలలో పూర్తి చేశారు. సుబ్బారావు, నాగలక్ష్మి దంపతులకు మొదటి సంతానం యలమందరావు కాగా, రెండవ కుమారుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి కుమార్తె కూడా ఉన్నారు. మొదటి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై న యలమందరావును బాపట్లలోని జూనియర్ న్యాయవాదులు, మిత్రబృందం సభ్యులు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. యనమలకుదురుకు చెందిన గొట్టిపాటి పూర్ణచంద్రరావు, ప్రమీలరాణి దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు దుర్గగుడికి విచ్చేశారు. వారి 60వ పెళ్లిరోజు పురస్కరించుకుని అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేయగా, కమిటీ చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.


