వార్డుల పెంపుతో నేతల్లో ఆశలు | - | Sakshi
Sakshi News home page

వార్డుల పెంపుతో నేతల్లో ఆశలు

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

● జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో వార్డుల పెంపు ● పునర్విభజన ప్రక్రియకు అధికారికంగా ప్రకటన

ఆశావహుల సందడి...

చీరాల: జిల్లాలో చీరాల, బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలున్నాయి. వార్డుల పెంపు ఉత్తర్వులు ప్రజలకు తెలియజేసేలా పురపాలక కమిషనర్లు నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేసి వారం రోజుల్లో అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంది. అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం వార్డుల సంఖ్య పెంపుపై మున్సిపల్‌ శాఖ నిర్ణయం తీసుకోనుంది. మున్సిపాలిటీలో జనాభా సంఖ్య ఆధారంగా వార్డుల విభజన ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. చీరాల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు, రేపల్లె మున్సిపాలిటీలో 28 వార్డులున్నాయి. బాపట్ల మున్సిపాలిటీలో శివారు గ్రామాల విలీనంపై హైకోర్టులో విచారణలో ఉండడంతో గత ఎన్నికలు నిర్వహించలేదు.

జనాభా ప్రాతిపదికన విభజన..

మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన ప్రక్రియపై అంచనాలు వేశారు. చీరాల మున్సిపాలిటీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 87 వేల మంది ఉన్నారు. ప్రస్తుతం జనాభా లక్ష వరకు ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా.. ఈ సంఖ్యను 44కు పెరగనుంది. అలానే రేపల్లె మున్సిపాలిటీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 54 వేల మంది ఉండగా ప్రస్తుతం 60 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం 28 వార్డులు ఉండగా.. ఈ సంఖ్య 36కు చేరనుంది. వార్డుల పెంపు పట్ల తీసుకోవాల్సిన విధి విధానాలపై అధికారులు చర్చిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో పాలకవర్గాల పదవీకాలం పూర్తి కావడంతో స్పెషల్‌ ఆఫీసర్‌ పాలన కొనసాగుతోంది. బాపట్ల మున్సిపాలిటీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 77 వేల మంది జనాభా ఉండగా ప్రస్తుతం లక్ష వరకు పెరిగింది. ఏడు శివారు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉత్తర్వులపై గ్రామాల ప్రజలు 2020 సంవత్సరంలో హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు స్టే విధించింది. ఈ కారణంగా 2021 మార్చిలో మున్సిపల్‌ ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్య పెంపుదల, ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. కోర్టులో స్టే తొలగిస్తేనే ఎన్నికలు జరిగేందుకు అవకాశం ఉంది.

మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెంచడంతో ఆశావహుల సందడి మొదలైంది. 1,500 మందికి ఒక వార్డు చొప్పున కేటాయింపులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఎక్కువ జనాభా ఉన్న వార్డులను రెండుగా చేస్తారని, పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల సంఖ్య పెరగనుండటంతో వార్డుల్లో ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీల్లో చురుగ్గా ఉండేవారు ఈ సారి ఎన్నికల బరిలో నిలబడేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వార్డుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి దోహదపడుతూ, పార్టీలో ఉత్సాహంగా ఉంటూ, పలుకుబడి ఉన్న నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వార్డు కౌన్సిలర్‌గా నిలబడేందుకు ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement