మంగళగిరి టౌన్: ఉన్నత విద్య ప్రక్షాళన పేరుతో పారదర్శకతకు తూట్లు పొడిస్తే సహించబోమని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలరాజు, బందెల నాజర్‌లు హెచ్చరించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్యామండలి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. ఎలాంటి చర్చలు లేకుండా, విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకోకుండా చీకటి జీవోల ద్వారా ఉన్నత విద్యావ్యవస్థలో మార్పులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. 40 సంవత్సరాలుగా పారదర్శకంగా కొనసాగుతున్న వ్యవస్థను అకస్మాత్తుగా నిర్వీర్యం చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా జీవో ద్వారా ఉన్నత విద్యా కమిషనర్‌కు అన్ని అధికారాలు కేంద్రీకరించడం వల్ల పారదర్శకత కోల్పోతుందని పేర్కొన్నారు. ప్రైవేటు కాలేజీల అనుమతులు, కోర్సుల ప్రారంభం, అడ్మిషన్ కౌన్సెలింగ్, ఫీజు నిర్వహణ వంటి కీలక అంశాలను ఒకే అధికారికి అప్పగించడం ద్వారా విద్యావేత్తల పాత్ర తగ్గిపోతుందని, విద్యారంగం వ్యాపారంగా మారే ప్రమాదముందన్నారు. పరీక్షలు, ప్రవేశాల ప్రక్రియలను వేరుచేయడం చట్టవిరుద్ధమని విమర్శించారు. ఉన్నత విద్యారంగం ప్రక్షాళన అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రెడ్డి సుబ్రహ్మణ్యంతో పాటు ఏడుగురు కమిటీ ఇచ్చిన నివేదికను వెంటనే బహిర్గతం చేసి మంత్రి వర్గంలో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు. జీవో నెం. 3ను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు యశ్వంత్, ప్రణీత్, అమరనాధ్, అజయ్, గణేష్, సతీష్ పాల్గొన్నారు.
ఉన్నత విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
జీఓ నెం.3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్


