డీఆర్వో గంగాధర్ గౌడ్ పీజీఆర్‌ఎస్‌లో 147 అర్జీల స్వీకరణ
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో అర్జీదారులు అందజేసే ప్రతి అర్జీని ఆడిట్ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్ జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అర్జీదారులు అందజేసే అర్జీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరం చూపాలని అధికారులను ఆదేశించారు. అర్జీ పరిష్కారం కాలేదన్న సమాచారం అర్జీదారులకు స్పష్టంగా సూచించాలని తెలియజేశారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండలు అధికంగా ఉంటాయని ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పని ఉంటేనే బయటకు వెళ్లాలని, ఎక్కువగా నీటిని తీసుకోవాలని ప్రజలకు సూచించారు. డ్వామా పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ లేబర్ బడ్జెట్‌కు సంబంధించి ఎంపీడీఓలకు ఆదేశాలు అందజేశారు. డీఆర్డీఏ పీడీ బి.సింగయ్య మాట్లాడుతూ ఏప్రిల్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీపై ఎంపీడీఓలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ లవన్న, ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ డిప్యూటీ సీఈఓ కృష్ణ, డీపీఓ ఎల్.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.


