నన్ను తీర్చిదిద్దిన మా‘స్టార్’
తెనాలి: 1995 సంవత్సరంలో ఒకరోజు... ఎన్వీఆర్ కల్యాణమండపం వేదికపై ‘అభిజ్ఞాన శాకుంతలము’ నృత్యరూపకం ప్రదర్శన. శకుంతల వృత్తాంతంతో కూడిన ఆ రూపకంలో పాత్రధారుల ఆహార్యం అద్భుతం. సన్నివేశాల కనుగుణమైన రంగాలంకరణ మరో ప్రత్యేకత! ఇక నటీనటుల ఆంగికం, అభినయం రక్తికట్టింది. మొత్తంమీద రంగస్థలంపై ఓ దృశ్యకావ్యం చూసిన అనుభూతితో ప్రేక్షకులు కరతాళధ్వనులు మిన్నంటాయి.
● ఎక్కడివారో తెలీదు...తెనాలిలో స్థిరపడిన ఓ నాట్యాచార్యుడు తీర్చిదిద్దిన నృత్యరూపకమది. అందులో శకుంతల పాత్రధారి జంధాల్య వేదవల్లి భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఫెలోషిప్‌ను అందుకుని నృత్యగురువుగా దేశవిదేశాల్లో ఎందరికో శిక్షణనిస్తున్నారు. ఆమె ఒక్కరే కాదు... చిలకలూరిపేట కళానిలయం సంస్థ ‘నాట్యమయూరి’ అవార్డును తొలిగా గెలుచుకున్న తెనాలికి చెందిన భాస్కర్ల రంగనాయకి, మరో శిష్యురాలు చల్లా బాలత్రిపురసుందరి, ఆలపాటి ప్రజ్ఞ...వీరంతా ఆ నాట్యాచార్యుడి శిష్యులే. ప్రస్తుతం అందరూ నృత్యగురువులుగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కళల తెనాలి గౌరవాన్ని ప్రకాశింపజేస్తున్నారు.
● నృత్యరంగానికి ఘనమైన వారసులను తీర్చిదిద్దిన ఆ నాట్యాచార్యుడు ఎం.దస్తగిరి...ఎండీ గిరిగా సుపరిచితులు. తెనాలిలో గల నృత్య శిక్షణ సంస్థ శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకులు. స్వస్థలం అనంతపురంలోని బోగాలకట్ట గ్రామంగా చెబుతారు. సంపన్న రైతుకుటుంబంలో జన్మించారు. నాయనమ్మ మరణంతో మనసు చెదిరి 1964లో ఏడో తరగతి చదువుతుండగానే ఇంటినుంచి వచ్చేశారు. 1969 నాటికి చీరాలకు చేరుకుని నాట్యాచార్యులు సీహెచ్ ఆంజనేయులు వద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు. స్నేహితుడి సలహాపై విజయవాడకు వెళ్లారు. జీవనోపాధి కోసం అక్కడ హోటల్ క్యాషియర్‌గా ఏడేళ్లు పనిచేశారు. నాట్యంపై ఆశ, ఆసక్తితో నాట్యాచార్యులు పరమానంద పిళ్లై, భాగవతుల యజ్ఞనారాయణశర్మ వద్ద శిక్షణ పొందారు. కొంతకాలం యజ్ఞనారాయణశర్మకు సహాయకునిగా ఉన్నారు.
● దేశీయ నృత్యరీతులను, వాటి వైశిష్ట్యాన్ని వ్యాప్తి చేయటానికి 1987లో శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీని స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరమే తొలి ప్రదర్శన ఇచ్చారు. దీనిని తిలకించిన పద్మశ్రీ నటరాజ రామకృష్ణ స్వయంగా గిరిని ఆహ్వానించి మెలకువలను నేర్పారు. నాట్యం అభ్యసిస్తూనే ‘మోహినీ భస్మాసుర’ నృత్యరూపకాన్ని ప్రదర్శించి, కళాభిమానుల ప్రశంసలను అందుకున్నారు. ఈ నృత్యరూపకాన్ని గిరితో సాటిగా ప్రదర్శింపగల మరో కళాకారుడు లేడని ఆ రోజుల్లోనే గురువు పరమానంద పిళ్లై రంగస్థల వేదికపై ప్రకటించారు. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, రతీమన్మథ, శిలువ ప్రభావం, ఇరవై సూత్రాల పథకం వంటి నృత్యరూపకాలను రచించి, ప్రదర్శనలతోపాటు శిక్షణనూ ఇవ్వసాగారు. నృత్యరూపకాలపై చేసిన కృషికి గుర్తింపుగా ‘దేవపారిజాతం’ అవార్డును వేదాంతం సత్యనారాయణశర్మ చేతులమీదుగా స్వీకరించారు. ‘నాట్యభూషణ’ గౌరవాన్నీ అందుకున్నారు.
● నటరాజ రామకృష్ణ శిక్షణలో ఉంటూనే ఆంధ్ర నాట్యం వ్యాప్తికి తగిన శిక్షణనివ్వాలని భావించిన గిరికి, అందుకు తెనాలి అనువైనదిగా ఎంచుకున్నారు. 1986లో తెనాలి చేరుకుని శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీని ఇక్కడ ప్రారంభించారు. తెనాలి ప్రజల అభిరుచికి అనుగుణంగా గురువు అనుమతితో కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యంలో శిక్షణను ఆరంభించారు. పురాణాలు, ఇతిహాసాల్లోని ప్రధానాంశాలను నృత్యరూపకాలుగా మలచి కళాభిమానులను రంజింపజేయటం కత్తిమీద సాము. నటనలో పరిణతి, కళాకారుల సమష్టి కృషి అవసరం, వీటికితోడుగా రంగస్థల అలంకరణ నుంచి వాయిద్య సంగీత వరకు అవసరమైన వనరులుంటేనే నృత్యరూపకం రక్తి కడుతుంది. ఇన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని నాట్యకళ పవిత్రతకు భంగం వాటిల్లకుండా కళాకారులకు శిక్షణనిచ్చి, దృశ్యకావ్యం అనిపించుకునేలా తెనాలిలో ‘అభిజ్ఞాన శాకుంతలము’ నృత్యరూపకాన్ని ప్రదర్శింపజేశారు ఎండీ గిరి.
● ఆ విధంగా తెనాలిలో నాలుగు దశాబ్దాలపాటు ఎందరో నృత్యకళాకారులను తీర్చిదిద్దారు. వీరి శిష్యులు కొందరు ఆయన బాటలోనే నృత్యగురువులుగా ఎదిగారు. ఆవిధంగా ఎక్కడనుంచో వచ్చి, తెనాలిలో స్థిరపడి సొంత కుటుంబమంటూ లేకుండా తన శిష్యబృందమే లోకంగా, నాట్యకళే ఊపిరిగా కొనసాగిన నాట్యాచార్యుడు ఎండీ గిరి, కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురై ఆదివారం మృతిచెందారు. తన కళావారసత్వాన్ని శిష్యుల రూపంలో వదిలి వెళ్లారు. ఆయన భౌతికంగా లేకుండా నాట్యరీతుల్లో ఆయన అడుగులు మువ్వల సవ్వడుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
‘నాట్యమయూరి’, ‘సూపర్ డ్యాన్స్ ఆర్టిస్ట్’ వంటి పలు అవార్డులతో సహా భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఫెలోషిప్‌ను పొందిన నన్ను నాట్యంలో తీర్చిదిద్దిన ఘనత గిరి మాస్టారుదే. మాస్టారుతో కలిసి రూపొందించిన నృత్యరూపకం ‘అభిజ్ఞాన శాకుంతలము’ అద్భుతం. పెళ్లయ్యాక కువైట్‌లో కొన్నేళ్లు ఉన్నాను. అక్కడ నృత్యశిక్షణాలయం నడిపాను. ఇప్పుడు హైదరాబాద్‌లో నటశిక్షణను కొనసాగిస్తున్నా.
– జంధ్యాల వేదవల్లి, నృత్యగురువు
తెనాలిలో కన్నుమూసిన ప్రముఖ నాట్యాచార్యుడు ఎండీ గిరికి నివాళిగా....
‘దేవపారిజాతం’ అవార్డు గ్రహీత ఎండీ గిరి
నృత్యరూపకాలతో తరగని ఖ్యాతి
తెనాలిలో స్థిరపడి నృత్యశిక్షణ
నృత్యగురువులుగా రాణిస్తున్న శిష్యబృందం


