బెట్టింగ్‌ బంగార్రాజులు! | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ బంగార్రాజులు!

Mar 31 2026 8:38 AM | Updated on Mar 31 2026 8:38 AM

బెట్టింగ్‌ బంగార్రాజులు!

చీరాల టౌన్‌: ఉత్కంఠగా సాగే ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలను కొందరు ఎంజాయ్‌ చేస్తుంటే.. అంతకు రెట్టింపు స్థాయిలో వ్యక్తులు తమ కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ భూతం కారణంగా వందలాది కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాయి. చివరకు పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం పాకెట్‌ మనీ డబ్బును బెట్టింగ్‌కు వెచ్చిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌లోనే బెట్టింగ్‌ యాప్‌లు, క్రికెట్‌ యాప్‌ల ద్వారానే అధికంగా పందేలు కాస్తున్నారు. పేదలు, యువత, రోజువారీ కూలీలు, ప్రైవేటు ఉద్యోగుల కూడా కష్టపడి సంపాదించిన డబ్బుతో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడి అప్పుల పాలువుతున్నారు.

– చీరాలలో కోట్లాది రూపాయలు బెట్టింగ్‌ కారణంగా చేతులు మారుతున్నాయి. వేటపాలెం నుంచి ఈపూరుపాలెం వరకు పెద్ద ఎత్తున బుకీలుగా ఏజెంట్లు కథ నడుపుతున్నారు. ఆన్‌లైన్‌లో సాగుతున్న ఈ బెట్టింగ్‌ దందాను పోలీసులు పసిగట్టేలోపే అంతా దుకాణం సర్దేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో చిన్న, మద్యతరగతి కుటుంబాల వారు ఈ బెట్టింగ్‌తో చితికిపోతున్నారు.

– గతంలో క్రికెట్‌ బెట్టింగ్‌ కారణంగా అప్పులపాలై, తిరిగి చెల్లించలేక మానసిక వేదనతో పేరాలలోని ఓ హోటల్‌ యజమాని తనయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడియార స్తంభం సెంటర్‌లో మెడికల్‌ షాపు నిర్వాహకుడు బెట్టింగ్‌ కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. పేరాలలోని ఓ వ్యాపారి తన వ్యాపారాన్ని సైతం బెట్టింగ్‌ కారణంగా వదిలేసి అప్పులపాలై తనువు చాలించాడు. బహిర్గతం కాని ఇటువంటి సంఘటనలు చీరాలలో చాలా ఉన్నాయి.

బెట్టింగ్‌కు డిపాజిట్‌!

చీరాలలో 10 మందికి పైగా బుకీలు ఏజెంట్లు ఉన్నారు. నియోజకవర్గంలోని పేరాల, చీరాల పట్టణం, జాండ్రపేట, వేటపాలెం, ఈపూరుపాలెం, చీరాల ప్రాంతాలలో జరిగే బెట్టింగ్‌లను నడుపుతున్నారు. అయితే ఎప్పటికికప్పుడు పోలీసులకు సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నగదు లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి. ఫలితాన్ని బట్టి బెట్టింగ్‌రాయుళ్లకు డబ్బు అందుతుంది. ఇందుకు నమ్మకస్తులను మాత్రమే ఎంచుకుంటున్నారు బుకీ ఏజెంట్లు. నమ్మకంలేని వారి వద్ద ముందే డబ్బు డిపాజిట్‌ చేసుకుంటున్నారు. బెట్టింగ్‌ బాబులు బుకీ ఏజెంట్లకు ముందుగానే రూ. 30 వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

చితుకుతున్న కుటుంబాలు

చీరాల ప్రాంతంలో అధికంగా నివసించే చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారు బెట్టింగ్‌ ఉచ్చులో చిక్కుకుని ఆర్థిక ఇబ్బందులతో విలవిల్లాడుతున్నారు. బెట్టింగ్‌లో డుబ్బ పోగొట్టుకుని గతంలో కొందరు ప్రాణాలు తీసుకుంటే మరికొందరు ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. బెట్టింగ్‌ల కోసం చేసిన అప్పులు వడ్డీతో సహా పేరుకుపోయి అవి తిరిగి చెల్లించలేని స్థితిలో వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక ఇళ్లలోని బంగారం తాకట్టు పెడుతున్నారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఎక్కువగా యువకులు, విద్యార్థులు, వ్యాపారులే బలైపోతున్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లతోపాటు చీరాల, పర్చూరు ప్రాంతాల్లో కొందరు బుకీలు, బెట్టింగ్‌ రాయుళ్లు పోలీసు సిబ్బందిలో కొందరితో సత్సంబంధాలు నెరుపుతూ, మామూళ్లు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌ దందాకు పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఛిద్రమవుతున్న జీవితాలు

గ్రామాలకు పాకిన బెట్టింగ్‌ భూతం

ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌లో జోరుగా పందేలు

పెద్ద ఎత్తున బుకీ ఏజెంట్లు

కట్టడి చేయలేని స్థితిలో ఖాకీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement