తెనాలి రూరల్: దళితుల్లోని మాల, మాదిగ సామాజిక వర్గ ప్రజలను రాయలేని పదాలతో అసభ్యకరంగా దూషించి, వీడియోలను సాషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వీడియోలో అతని తల్లి కూడా దళితుల గురించి అసభ్యంగా మాట్లాడడంతో ఆమైపెనా కేసు నమోదు చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వివరాలు వెల్లడించారు.
● మండలంలోని ఖాజీపేటకు చెందిన చల్లా నాగరాజు చైన్నెలో కరెంటు పనులకు వెళుతుంటాడు. వచ్చిన డబ్బుతో మద్యం తాగి తిరుగుతుంటాడు. ఈ నెల 26న చైన్నె నుంచి వచ్చిన అతను 27న ఫూటుగా మద్యం తాగాడు. నందివెలుగు–గుంటూరు రోడ్డులో గుంటూరు నుంచి కొలకలూరుకు చెందిన బుల్లా వివేక్, అతని భార్య బైక్‌పై వస్తుండగా ఖాజీపేట వద్ద ఆవుల మంద అడ్డు వచ్చింది. అదే సమయంలో నాగరాజు వివేక్‌తో ఘర్షణ పడి దుర్భాషలాడి దాడి చేశాడు. అడ్డుకోబోయిన వివేక్ భార్యనూ నెట్టివేసి అసభ్యంగా దూషించాడు.
● దంపతులు వెళ్లిపోయిన అనంతరం నాగరాజు బైక్‌పై కొలకలూరు సెటరులోని అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాల వద్దకు వెళ్లి ఫేస్ బుక్ లైవ్ వీడియో పెట్టి మాల, మాదిగ సామాజిక వర్గ ప్రజలను అసభ్యంగా దూషించాడు. తిరిగి ఇంటికి వెళ్లి తీవ్ర అసభ్యపదజాలంతో వీడియో చేసి పోస్ట్ చేశాడు. దీనిపై దళిత సంఘాలు ఆందోళన చేశాయి. – బాధితుడు వివేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు.
● నిందితుడు ఇంట్లో వీడియో రికార్డు చేస్తుండగా అతని తల్లి పద్మ అలియాస్ వెంకమ్మ దళితులను కించపరిచే విధంగా మాట్లాడడంతో ఆమె పైనా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నాగరాజుకు 2019లో వివాహం కాగా మద్యంకు బానిసైన భర్తతో వేగలేక భార్య 2024లో విడిచిపెట్టిందని చెప్పారు. నిందితుడిపై రౌడీ షీట్ తెరవనున్నట్టు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ నాయబ్‌రసూల్, ఎస్‌ఐ కె. ఆనంద్, సిబ్బంది ఉన్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.


