శ్రీరామ నవమిని పురస్కరించుకొని బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోని వాడవాడలు రామనామంతో మార్మోగాయి. శుక్రవారం చలువ పందిరిలో దశరథ రాముని కల్యాణ క్రతువును ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ‘రామ నామము, రామ నామము.. రమ్యమైనది రామ నామము’ అంటూ భక్తులు కల్యాణ మండపాలకు చేరుకున్నారు. జగదభి రామయ్య కల్యాణాన్ని కనులారా తిలకించి ప్రణమిల్లారు. వడపప్పు, పానకాల ప్రసాదాలను స్వీకరించి సీతారామ లక్ష్మణ, హనుమ ప్రతిమల ముందు మోకరిల్లారు.
వైభవంగా రాములోరి కల్యాణం
రేపల్లె: శ్రీరామ నవమిని పురస్కరించుకొని నియోజకవర్గంలో శుక్రవారం వేడుకలను వైభవంగా నిర్వహించారు. చలువ పందిళ్లను ఏర్పాటు చేసి సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపల్లె పట్టణంలోని రైలుపేట పట్టాభిరామస్వామి, రామకోటిపేటలో పట్టాభి రామస్వామి ఆలయం.. 1, 6వ వార్డుల్లోని రామాలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అదే విధంగా వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం, పెదకూరగాయల మార్కెట్, ఇసుకపల్లి, నేతాజీనగర్, పాతస్టేట్ బ్యాంక్, 10వ వార్డు తదితర ప్రాంతాలలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి సీతారాముల ప్రతిమలను నెలకొల్పి కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పట్టణ, మండలంలోని పలు పందిళ్లను సందర్శించి సీతారాములకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
భట్టిప్రోలు: శ్రీరామ నవమిని పురస్కరించుకొని భట్టిప్రోలు మండలంలోని గ్రామాలు పులకించాయి. చక్కని సీతను అందాల రాముడు మనువాడిన ఆ శుభగడియల్లో భక్తులు రామనామ స్మరణ చేస్తూ తరించారు. భట్టిప్రోలులోని విఠలేశ్వరనగర్ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కాగిత పరుశురామ్–నిర్మల దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. పోలన శివశంకరరావు సిద్ధాంతి పూజా కార్యక్రమాలను ఘనంగా జరిపారు. అద్దేపల్లి రామాంజనేయ గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో రామాంజనేయ నగర్(ఎస్టీ కాలనీ)లోనూ సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు.
పిట్టలవానిపాలెం(కర్లపాలెం): శ్రీరామనవమిని పురస్కరించుకొని పిట్టలవానిపాలెం మండల పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం రాములోరి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పిట్టలవానిపాలెం, అల్లూరు, ఖాజీపాలెం, చందోలు, మంతెనవారిపాలెం, భవనంవారిపాలెం, జిఎన్‌పాలెం, సంగుపాలెం, కోడూరు గ్రామాల్లో రామాలయాల వద్ద సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపారు. పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాలను తిలకించారు.
కర్లపాలెం: శ్రీరామ నవమి సందర్భంగా మండలంలోని నాగరాజుపాలెం, దమ్మనవారిపాలెం, దుండివారిపాలెం, తిమ్మారెడ్డిపాలెం, యాజలి, బుద్ధాం ఏట్రవారిపాలెం, కొత్తనందాయపాలెం, నల్లమోతువారిపాలెం, పాతనందాయ పాలెం, కర్లపాలెం, పాపిరెడ్డిపాలెం, బంగారురెడ్డిపాలెం, చింతాయపాలెం, తదితర గ్రామాలలోని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.


