బెట్టింగ్‌లకు బానిసలైతే జీవితం అంధకారమే | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌లకు బానిసలైతే జీవితం అంధకారమే

Mar 28 2026 7:39 AM | Updated on Mar 28 2026 7:39 AM

బాపట్లటౌన్‌: బెట్టింగ్‌లకు బానిసలైతే జీవితం అంధకారంగా మారుతుందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. శనివారం నుంచి దేశవ్యాప్తంగా ఐపీఎల్‌ సీజన్‌ మొదలవుతున్న నేపథ్యంలో వీటిని అదునుగా చేసుకొని కొందరు స్వార్థపరులు, చెడు నడత కలిగిన వ్యక్తులు క్రికెట్‌ బెట్టింగ్‌లకు తెరలేపే అవకాశం ఉందన్నారు. బెట్టింగ్‌లకు బలి అవుతున్న వారిలో ఎక్కువ శాతం యువతేనన్నారు. సులభంగా అధిక రెట్టింపుల్లో నగదును అర్జించవచ్చని యువతకు ఆశ చూపుతూ బెట్టింగ్‌ ఊబిలో దించుతారన్నారు. ఒక్కసారి బెట్టింగ్‌ లకు అలవాటు పడితే వాటి నుండి బయటకు రావడం కష్టతరం అవుతుందన్నారు. బెట్టింగ్‌లో ఒకసారి ఆదాయం వచ్చినా పలుమార్లు నష్టపోవడం జరుగుతుందన్నారు. ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి, చేసిన అప్పులను తీర్చడానికి యువత దొంగతనాలకు, ఇతర నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారన్నారు. బెట్టింగ్‌ అనేది పెనుభూతం లాంటిదని, ఆశ చూపి అధ:పాతాళానికి నెట్టేస్తుంది. యువత దానికి బలికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రికెట్‌ మ్యాచ్‌ లను వినోదం కోసం మాత్రమే చూడాలని, బెట్టింగుల వైపు మొగ్గు చూపకూడదన్నారు. యువత, విద్యార్థులు బెట్టింగ్‌ జోలికి వెళ్లకుండా చదువుపై, తమ ఉజ్వల భవిషత్తుపై దృష్టి సారించాలన్నారు. తమ తల్లిదండ్రుల ఆశయాల సాధన కోసం ఉన్నతంగా జీవించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. బెట్టింగులకు పాల్పడుతున్నట్లయితే వారికి నచ్చచెప్పి ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలన్నారు. కొద్ది మొత్తంలో బెట్టింగ్‌ వేసినా ఉపేక్షించకూడదన్నారు. అదే భవిష్యత్తులో పెను వ్యసనంగా మారుతుందన్నారు. గతంలో బెట్టింగ్‌ లకు పాల్పపడిన వారిపై, అనుమానితుల పై నిఘా ఉంచామన్నారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగులను నిర్వహించినా, అమాయకులను, యువతను బెట్టింగ్‌ ఊబిలోకి లాగాలని ప్రయత్నించినా ఉపేక్షించబోమన్నారు. నిర్వాహుకులను గుర్తించి వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement