బాపట్లటౌన్: బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామంలో శ్రీరామనవమిను పురస్కరించుకొని శుక్రవారం గొర్రెల కాపరుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పొట్టేళ్ల పందెం హోరాహోరీగా సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి 26 పొట్టేళ్లు పోటీల్లో పాల్గొన్నాయి. మూడు రౌండ్‌లలో ఉత్తమ ప్రతిభ కనపరిచి కాకుమానుకు చెందిన ముత్యాల నాగయ్య పోటేలు ప్రథమ బహుమతి సాధించింది. ద్వితీయ బహుమతి అద్దంకి మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన మారుబోయిన దుర్గాప్రసాద్‌కు చెందిన పొటేలు సాధించింది. తృతీయ బహుమతి చిన్నగంజాం మండలం, ఉలిచి గ్రామానికి చెందిన ధీరకు చెందిన పోటేలు సాధించింది. నాల్గవ బహుమతి బాపట్ల మండలం, పిన్నిబోయినవారిపాలెం గ్రామానికి చెందిన పిన్నిబోయిన కోటేశ్వరరావుకు చెందిన పోటేలు సాధించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోటీలు సాయంత్రం 6 గంటలకు ముగిశాయి.
పోటీలకు ప్రథమ బహుమతి క్షత్రియ సేవాసంఘం, ద్వితీయ బహుమతి పిన్నిబోయిన కృష్ణమూర్తి, తృతీయ బహుమతి కర్నేటి బాలకృష్ణ, నాగబాబు, నాల్గవ బహుమతి నక్కల నాగార్జునలు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు, గ్రామపెద్దలు, గొర్రెల కాపరుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
ప్రథమ స్థానంలో కాకుమాను పొట్టేలు
బహుమతులు అందజేసిన నిర్వాహకులు


