చివరి మజిలీలో చింతింపే..!
చీరాల హిందూ శ్మశానవాటికలో అంతిమ సంస్కారానికి అగచాట్లు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.1.20 కోట్లు మంజూరు నూతన భవనం, సీసీ రోడ్ల నిర్మాణం, దహన యంత్రం ఏర్పాటు వసతులు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహం
కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంది
చీరాల రూరల్: మనిషి బతికుండగా కన్నీళ్లు, కష్టనష్టాలు, ఎన్నో బాధలు.. అంతకు మించిన ఆవేదన. అదే మనిషి కన్నుమూసిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకూ అగచాట్లు వెంటాడుతున్నాయి. మానవ మృతదేహాలను ఖననం చేయాలన్నా, దహన సంస్కారాలు నిర్వహించాలన్నా పేద, మధ్య తరగతి ప్రజలకు ఖరీదైన వ్యవహారమే కాదు.. కాస్త శ్రమతో కూడుకున్న పని. కర్రలు పోగు చేయడం దగ్గర నుంచి మృతదేహం పూర్తిగా కాలిపోయే వరకు శ్మశానంలో పడిగాపులు కాయాల్సి ఉంటంది. ఈ క్రమంలో వర్షం కురిస్తే మృతుడి బంధువుల వేదన వర్ణనాతీతం. దేహాలు పూర్తిగా కాలకపోతే అరిష్టమని, ఆత్మలు శాంతించవని పెద్దలు చెబుతుంటారు. అంతేగాక మృతదేహాలు కాలే సమయంలో శ్మశానం చుట్టుపక్కల నివాసముంటున్న వారు దుర్వాసనను తప్పక భరించాల్సిన పరిస్థితి. చీరాల పట్టణంలోని కారంచేడు రోడ్డులో గల హిందూ శ్మశానవాటికలో ఈ సమస్యలన్నింటికీ చమరగీతం పాడేందుకు నాలుగేళ్ల క్రితం అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుం బిగించింది. గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి విజ్ఞప్తి మేరకు రూ.1.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. దాదాపు పనులన్నీ పూర్తయినప్పటికీ హిందూ శ్మశానవాటికను చీరాల ప్రజలు సక్రమంగా వినియోగించుకోలేని దుస్థితి. విద్యుత్, నీటి వసతికి సంబంధించి స్వల్ప స్థాయి పనులు చేపడితే శ్మశానవాటిక అందుబాటులోకి వస్తుందని తెలిసినా ప్రస్తుత పాలకులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంపై చీరాల వాసులు దుమ్మెత్తిపోస్తున్నారు.
రూ.1.40 కోట్లతో వసతులు
హిందూ శ్మశానవాటికలో అభివృద్ధి పనులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.20 కోట్ల నిధులు విడుదల చేసింది. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించిన అధికారులు దహన యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు నూతన భవనం పూర్తి చేశారు. భవనం చుట్టూ వాహనాలు తిరగటానికి వీలుగా సిమెంట్ రోడ్లు, మంచినీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ సౌకర్యం కల్పించారు. దహన యంత్రాన్ని చైన్నెలో కొనుగోలు చేసి అక్కడి నిపుణులను చీరాల రప్పించి సంబంధిత పనులు సైతం పూర్తి చేయించారు. మృతదేహాన్ని కాల్చే సమయంలో చుట్టుపక్కల నివాసముంటున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పొగను నేరుగా బయటకు పంపించేందుకు భవనం పక్కనే 100 అడుగుల పొడవుతో భారీ గొట్టాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఈ దహన యంత్రం అందుబాటులోకి వస్తే మృతదేహాల అంతిమ సంస్కార ప్రక్రియ కేవలం గంట వ్యవధిలోనే పూర్తవుతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్మశానవాటికలో వసతులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. స్వల్ప మొత్తంలో నిధులు మంజూరు చేస్తే దహనవాటిక అందుబాటులోకి వస్తుందని పాలకులకు తెలిసినా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హిందూ శ్మశానవాటికలో భవన నిర్మాణం పూర్తి చేయడంతోపాటు యంత్ర పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. మరికొంత నిధుల కొరత కూడా ఉంది. పనులను కొద్ది రోజుల్లో పూర్తి చేసి దహన యంత్ర సేవలను అందుబాటులోకి తీసుకువస్తాం.
– రఘురాం, మున్సిపల్ డీఈ


