ముంచిన మోంథా..బాబు వంచన
చీరాల: ఇటీవల మోంథా తుపానుకు దెబ్బతిన్న పంటలకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు సాయం అందించలేదు. పంటనష్టం అంచనాలు తయారు చేసి బాధిత రైతులను గుర్తించడంతో సరిపెట్టారు. తుపాను కారణంగా చీరాల నియోజకవర్గంలోని రెండు మండలాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా వరి పొలాల్లో నీరు నిలిచిపోవడంతో అందివచ్చే సమయంలో పంట చేజారిపోయింది. నష్టాన్ని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. చీరాల మండలంలో వాద, చీరాలనగర్, ఈపురుపాలెం ప్రాంతాలలో పంటనష్టం వాటిల్లింది. నియోజకవర్గ వ్యాప్తంగా మోంథా తుపానుకు సంబంధించి 3,300 మంది బాధిత రైతులను గుర్తించారు. 4,670 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు నిర్ధారించారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం ప్రకటించినా రైతులకు మాత్రం ఇంకా జమ కాలేదు. నష్టపోయిన పంటలకు సంబంధించిన వివరాల నివేదికను ఉన్నతాధికారులకు పంపించామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సమన్వయకర్త కరణం వెంకటేష్‌బాబు, పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం వెంటనే అందించాలని కోరుతూ పార్టీ తరఫున ఆర్డీఓకు వినతిపత్రం కూడా అందించారు.
తుపాను వలన తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి. దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలన చేశారేగానీ నష్టపరిహారం అందలేదు. రైతు సేవా కేంద్రాల్లోనూ సిబ్బంది కొరత వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ–పంట నమోదు కూడా సక్రమంగా సాగడం లేదు. ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం అందించాలి.
● తుపానుకు దెబ్బతిన్న పంటలకు
అందని నష్టపరిహారం
● బాధితుల గుర్తింపుతో సరిపెట్టిన
చంద్రబాబు సర్కారు
● చీరాల నియోజకవర్గంలో
4,670 ఎకరాల్లో వరి పంట నష్టం
● సాయం కోసం 3,300 మంది
బాధిత రైతులు ఎదురుచూపు
పంట నష్టపరిహారం అందించాలి
– కావూరి రమణారెడ్డి, వైఎస్సార్ సీపీ
రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు