అభివృద్ధి పనులకు భూసేకరణ వేగవంతం
బాపట్ల: అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు భూసేకరణ వేగంగా చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. భూ సేకరణ ప్రక్రియపై అనుబంధ శాఖల అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీక్షణ సమావేశం నిర్వహించారు. నిజాంపట్నం మండలంలో రాడార్ కేంద్రానికి 1.50 ఎకరాల భూమి కేటాయించాలని చెప్పారు. నిడ్‌క్యాప్ ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తికి బయోమాస్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు మార్టూరులో 100 ఎకరాలను, బాపట్లలో హెలీ ప్యాడ్ ఏర్పాటు చేయడానికి 10 ఎకరాలు కేటాయించాలని ఆదేశించారు. ప్రభుత్వ, అసైన్‌న్డ్ భూములతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఆర్డీఓలకు కలెక్టర్ సూచించారు. గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రానికి భూమి కేటాయించాలని చెప్పారు. జిల్లా కోర్టుకు 2.50 ఎకరాల భూమి కేటాయించగా, 10 ఎకరాలు కావాలని న్యాయ శాఖ నుంచి వినతులు వచ్చాయని తెలిపారు. డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ కోసం ఐదు ఎకరాలు, మార్క్‌ఫెడ్ కార్యాలయానికి 10 సెంట్లు భూమి గుర్తించాలని ఆదేశించారు. 54 ప్రాంతాల్లో హెల్త్ వెల్నెస్ సెంటర్ల నిర్మాణానికి, పర్చూరులో రైతు బజార్, జంపనిలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు 5 ఎకరాల భూమి గుర్తించాలని ఆదేశించారు.
రైతులకు ఉచితంగా గోనె సంచులు
ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు ఉచితంగా ఇవ్వాలని, తెచ్చుకున్న వారికి నగదు చెల్లించాలని జిల్లా ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందితో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. రైతులు స్వయంగా గోనె సంచులు తెచ్చుకుంటే రూ.4.74లు చొప్పున ప్రభుత్వమే నగదు ఇస్తుందని ఆయన వెల్లడించారు.
కలగా మిగులుతున్న ఈపురుపాలెం స్ట్రెయిట్ కట్ సమస్య
ధర్నాలు ఆందోళనలు చేసినా ఈపురుపాలెం స్ట్రెయిట్ కట్ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని వాడరేవు మాజీ సర్పంచి ఎరిపిల్లి రమణ అన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే పడవల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న మత్స్యకారులు స్ట్రెయిట్ కట్ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ సీ మౌత్ సమస్యపై కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నా ఎటువంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు. బండరాళ్లతో పూడిపోయిన కాలువ కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బండరాళ్లను తొలగించి చేపల వేటకు వెళ్లి పడవల రాకపోకలను సజావుగా కొనసాగించాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రస్తుత జిల్లా కలెక్టర్ వచ్చిన కొత్తలో ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదని గుర్తు చేశారు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని, మత్స్యకారులు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని రమణ ఆందోళన వ్యక్తం చేశారు.సమస్యను సత్వరమే పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని తెలిపారు. కార్యక్రమంలో మత్స్య కార్మిక సంఘం నాయకులు గంగిరి ఏసుబాబు, వై. బాబ్జి, పీక్కి సూరిబాబు పాల్గొన్నారు.
గిరిజనుల భూ సమస్యలను పరిష్కరించాలి
బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామ గిరిజనుల భూ సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్. గంగయ్య కోరారు. ఈ మేరకు ఆయన సోమవారంప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.


