● కోటి సంతకాల సేకరణ విజయవంతం ● మాజీ మంత్రి మేరుగ నాగార్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని కోటి సంతకాల కార్యక్రమం ద్వారా ప్రజలు వ్యతిరేకించారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. బుధవారం మేరుగ బాపట్లలో విలేకరులతో మాట్లాడారు. అన్ని వర్గాల వారి నుంచి వచ్చిన వ్యతిరేకత చంద్రబాబు సర్కారుకు చెంపపెట్టులాంటిదని అన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిందన్నారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభించిందని గుర్తుచేశారు. బాపట్ల జిల్లాలో కార్యక్రమం పెద్ద ఎత్తున సాగిందన్నారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 60 వేలకు మించి సంతకాలు సేకరించామని పేర్కొన్నారు. జిల్లా నుంచి మొత్తం 3,73,199 సంతకాలు సేకరించామన్నారు. బుధవారం సంతకాల పత్రాలను జిల్లా కేంద్రం బాపట్లకు తరలించామని చెప్పారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు బలి అవుతోందని పేర్కొన్నారు. పేదవారు ఉన్నత చదువులు చదవడం చంద్రబాబు ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలు, కార్యకర్తలు, అభిమానులతోపాటు, సంతకాలు చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అన్ని వర్గాల వారికి మేరుగ కృతజ్ఞతలు తెలిపారు.


