రక్షక భటులే భయపెట్టడం తగదు
ముందస్తు చర్యలంటూ అరెస్టు ఎందుకు? రాజకీయ కక్షలతో పెట్టిన కేసులలో కూడా రౌడీషీట్‌లా..! తీరు మార్చుకోవాలని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన హితవు
బాపట్ల: రక్షణగా నిలవాల్సిన పోలీసులే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వద్దకు వెళ్లే అవకాశం ఉందంటూ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చి అరెస్టు చేయటం ఏ మేరకు న్యాయమో అర్థం కావడం లేదన్నారు. పోలీసు నిఘా వ్యవస్థ సరిగా లేకపోవటం వలనే బాపట్లలో నాయకులను అదుపులోకి తీసుకున్నారని కోన చెప్పారు. రాత్రి పూట ఇష్టమొచ్చినట్లు నాయకుల ఇళ్లకు వచ్చి అదుపులోకి తీసుకోవటం ఏంటో అర్థం కావటం లేదన్నారు. తన 22 సంవత్సరాల రాజకీయంలో ఇంతవరకు ఎవరూ నోటీసు ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు నోటీసు ఇవ్వటంతోపాటు అరెస్టు చేయటం జరిగిందన్నారు. నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫోన్లు చేయటంతోపాటు కంగారు పడ్డారని, సున్నితమైన విషయాలను కూడా రాద్ధాంతం చేయటం సరికాదన్నారు. రాజకీయ నాయకులపై పెట్టే కక్ష సాధింపు కేసులను లెక్కకట్టి రౌడీషీట్లు ప్రారంభించటం, రౌడీలకు కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు వీరిని కూడా పిలిచి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలన్నారు. అధికారం ఎవరికి ఉన్నప్పటికీ ఇలాంటి తీరు సరికాదన్నారు. డీఎస్పీకి ఈ విషయాన్ని వివరించామని తెలిపారు. సొంత పూచీకత్తు తీసుకుని వెంటనే పంపుతామని పంపారని చెప్పారు. మనం జిల్లా కేంద్రంలో ఎస్పీ పరిధిలో ఉన్నామని, చిన్నా చితకా విషయాలపై ఇష్టమొచ్చినట్లు వ్యవహరించటం సరికాదని సూచించారు. రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పరిస్థితిని గమనించి ముందుకుపోతే మంచిదని కోన సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్‌బాబు, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య, జోగి రాజాలను అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. కోన రఘుపతిని అరెస్టు చేశారనే విషయం తెలియగానే భారీగా నాయకులు, కార్యకర్తలు బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రాత్రి 12 గంటలకు నోటీసులు ఇవ్వటంతోపాటు నాయకులను అదుపులోకి తీసుకుని ఉదయం 9.30 గంటలకు వదిలిపెట్టారు. కోనను వదిలిపెట్టడంతో నాయకులు, కార్యకర్తలు వెనుదిరిగారు.


