ప్రజలకు మెరుగైన వైద్యమే లక్ష్యం కావాలి
బాపట్ల: ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్యాధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రజలకు సక్రమంగా అందించాలని కలెక్టర్ చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డులు అందించాలన్నారు. పి ఎం జి ఏ వై కార్డులను లబ్ధిదారులైన ఆయా కుటుంబాలకు అందించాలన్నారు. ప్రధానమంత్రి ఆరోగ్య కార్డుల ఈకేవైసీ జిల్లాలో 9,600 పెండింగ్ లో ఉన్నాయన్నారు. లబ్ధిదారుల ఈకేవైసీ తప్పనిసరిగా చేపట్టాలన్నారు. వైద్యశాలల్లో ఔషధాల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఔషధాల కొరకు ముందస్తు ఇండెంట్ పంపాలని సూచించారు. జిల్లాకు సరిపడా మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతం కావడంతో మొక్కలు, చెట్లు అధికంగా ఉన్నందున పాముకాటుకు గురైన వారికి తక్షణమే వైద్యం అందించేందుకు ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి వైద్యశాలలో సంబంధిత ఔషధాలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా వైద్యాధికారులు మంచి వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించేలా మీ సేవలు విస్తృతం కావాలని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ పద్మావతి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ డాక్టర్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
బస్టాండ్‌లో పరిశుభ్రత పాటించాలి
ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి, ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల పట్టణంలోని ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్ ను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ లో ఆయన కలియతిరిగారు, ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం పాత బస్సు స్టాప్ కూడలికి ఆయన చేరుకుని పరిశీలించారు. ప్రయాణికులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు లేకపోవడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ నిర్మాణం జరిగి కొన్నేళ్లు గడుస్తున్నప్పటికీ సౌకర్యాలు లేని బస్సు స్టాప్ వద్ద ప్రయాణికులు అధికంగా ఉండడంపై ఆరా తీశారు. అని సౌకర్యాలతో ఉన్న బస్టాండ్ ను ప్రయాణికులు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఎల్లప్పుడు పరిశుభ్రంగానే ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. బాపట్ల బస్టాండ్ లో ఏడు ఫ్లాట్ ఫామ్ లు ఉండగా, ప్రతిరోజు 100కు పైగా బస్సులు వస్తాయని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్లాట్ ఫామ్ ల వద్ద కలెక్టర్ పరిశీలించారు. మరుగుదొడ్ల లోకి వెళ్లి పరిశుభ్రతను పరిశీలించారు. తక్షణమే పారిశుద్ధ్య కార్మికులను నియమించుకోవాలని చెప్పారు. ప్రయాణికులకు తప్పనిసరిగా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సులు లోపలికి వెళ్లే మార్గం, వెలుపలకు వచ్చు మార్గాలను పరిశీలించారు. పార్కింగ్ స్థలం, అద్దెకు ఇచ్చిన వాణిజ్య సముదాయాన్ని ఆయన పరిశీలించారు. వాటి ద్వారా అద్దెలు క్రమంగా వస్తున్నాయా లేదా అని ఆరా తీశారు. డిపో మేనేజర్ కార్యాలయాన్ని, డ్రైవర్లు స్టాఫ్ రెస్ట్ రూమ్ లను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడారు. ప్రయాణికులకు వీలుగా బస్సులు నడుస్తున్నాయా..?, సకాలంలో వస్తున్నాయా...?, సరిగా సమాధానం చెబుతున్నారా..?, తాగునీరు అందుబాటులో ఉంటుందా..? అంటూ ఆరా తీశారు. అనంతరం బస్సు స్టాప్ కూడలికి చేరుకున్నారు. అక్కడ వసతి సౌకర్యాలు పరిశీలించారు. నీటి ట్యాప్ కనెక్షన్లు ఉన్నప్పటికీ తాగునీరు రాకపోవడంతో యుద్ధ ప్రాతిపదికన తాగు నీటి సౌకర్యం కొరకు ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్సు స్టాప్ ను ఆధునికరించాలని, ప్రయాణికులు వేచి ఉండడానికి మంచి కుర్చీలు సౌకర్యంగా ఏర్పాటు చేయాలన్నారు. బస్సు స్టాప్ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు వచ్చి శుభ్రం చేయాలన్నారు. ఇందు కొరకు డ్యూటీలు వేయాలన్నారు. ఆయన వెంట ఆర్డిఓ పి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసిల్దార్ షాలీమా, తదితరులు ఉన్నారు.
ప్రగతి సూచికలు అభివృద్ధి దిశగా ఉండాలి
స్వర్ణాంధ్ర ప్రగతి సూచికలు అభివృద్ధి దిశగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. స్వర్ణాంధ్ర ప్రగతి సూచికలపై వివిధ శాఖల అధికారులతో గురువారం ఆయన స్థానిక కలెక్టరేట్ నుంచి హైబ్రిడ్ మోడ్(జిల్లా అధికారులు, వీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులు)లో సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా ప్రగతి దిశగా పయనించాలని కలెక్టర్ సూచించారు. ఇంజినీరింగ్ శాాఖలకు అభివృద్ధి ఆధారంగా ప్రభుత్వం ర్యాంకులను ఇస్తుందన్నారు. నాలుగు గ్రేడ్ లలోనూ అభివృద్ధి కనిపించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ప్రతి కుటుంబానికి స్థిరమైన గృహం ఉండడం గృహ నిర్మాణశాఖ అధికారులకు లక్ష్యంగా ఉందన్నారు. అదే మాదిరిగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడం, పైప్ లైన్లు వేయడం ఇందులో భాగమేనన్నారు. గృహ వినియోగానికి విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందన్నారు. ప్రజలకు సుఖమయ ప్రయాణం సాగేలా మంచి రహదారులను అభివృద్ధి చేయాలన్నారు. గుంతలు రహిత రహదారులు ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే అవకాశాలు కల్పించాలన్నారు. మునిసిపాలిటీలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
– జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


