పరిశుభ్రత మెరుగుకు కృషి చేయాలి
బాపట్ల: పరిశుభ్రతలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ ప్రచార ముగింపు కార్యక్రమం బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. ఉత్తమ సేవలందించిన వారికి, క్లాప్ మిత్రలకు జిల్లా కలెక్టర్ సన్మానం చేశారు. ఇల్లు నిర్మించుకుంటున్న వారంతా మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు పరిశుభ్రతను పాటించాలని సూచించారు. డ్వామా ఏపీడీ శివన్నారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రాంబాబు, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
రొయ్యల పరిశ్రమలపై అవగాహన
రొయ్యల పరిశ్రమలలో పనిచేస్తున్న మహిళల సంక్షేమం, భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రొయ్యల సినర్జీ ప్రాజెక్టులో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాల కొరకు మత్స్య, కార్మిక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ప్రచార యాత్ర వాహనాన్ని జిల్లా కలెక్టర్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. గోడపత్రాలను విడుదల చేశారు. మత్స్య శాఖ డీడీ గాలి దేముడు, ఏడీ కృష్ణ కిషోర్, డిప్యూటీ చీఫ్ ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ త్రినాథ్ రావు, డైరెక్టర్ సునీల్ కుమార్, కార్మికశాఖ సహాయ అధికారి సాయి జ్యోతి, రవి ప్రదీప్, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారులతో అభివృద్ధి
జాతీయ రహదారుల నిర్మాణం బాగుంటే జిల్లా అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై కలెక్టర్ బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి– 167 ఏ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు– నిజాంపట్నం రహదారి నిర్మాణం, నిడుబ్రోలు–చందోలు ఆర్ అండ్ బీ రహదారి విస్తరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. కర్లపాలెం–గణపవరం రహదారి పనులు ప్రతివారం పురోగతిపై నివేదిక ఇవ్వాలన్నారు. రేపల్లె–నిజాంపట్నం ఆర్ అండ్ బీ రహదారి నిర్మాణంపై వివరాలు ఇవ్వకపోవడం ఏంటని సంబంధిత డీఈని కలెక్టర్ నిలదీశారు. జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిణి రాజదిబోరా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.
వరి వంగడాల ఉత్పత్తి అభినందనీయం
వరి నూతన వంగడాల ఉత్పత్తి అభినందనీయమని జిల్లా కలెక్టర్ అన్నారు. బాపట్లలోని వ్యవసాయ పరిశోధన స్థానాన్ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు. వరి పరిశోధన కేంద్రంలో పరిశోధన ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 14 రకాల వరి వంగడాలు ఇక్కడ నుంచే ఉత్పత్తి చేయడం అభినందనీయమన్నారు. కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ కృష్ణవేణి ఆయనకు వాటి గురించి వివరించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


