ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆర్థికాభివృద్ధి
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయం రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. రైతు సాధికార సంస్థ, జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఆర్‌పీ శిక్షణ కార్యక్రమం గురువారం నాలుగవ రోజుకు చేరింది. కార్యక్రమంలో పాల్గొన్న అమలకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణాన్ని సంరక్షించవచ్చని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న వరి, మిరప, పత్తి, మొక్కజొన్న, కూరగాయలతో పాటు పలు అంతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. భూమి ఆరోగ్యంగా ఉండాలంటే 365 రోజులు పచ్చని పంటలతో భూమిని కప్పి ఉంచే విధానం పాటించాలని సూచించారు. జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం వంటి ప్రకృతి ఇన్‌పుట్స్, కషాయాలు గ్రామస్థాయిలో తయారు చేసి రైతుల కు సకాంలో అందించడం ద్వారా క్రిమిసంహారక ఖర్చులు తగ్గించుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ఎన్‌ఎఫ్‌ఏ మల్లేశ్వరి, అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజ్, జిల్లా ఎన్‌ఎఫ్‌ఏలు సైదయ్య, అప్పలరాజు, నందకుమార్, సౌజన్య, మేరి పాల్గొన్నారు.


