దుర్గి శిల్ప కళా వైభవం
ఖండాంతరాలు దాటిన దుర్గి శిల్ప ఖ్యాతి ప్రాచీన కాలం నాటి శిల్పకళా చాతుర్యానికి పుట్టినిల్లుగా దుర్గి క్రీ.శ 12వ శతాబ్దంలోనే శిల్ప కళకు బీజం అద్భుత నైపుణ్యంతో బండరాళ్లకు సజీవ రూపాన్ని ఇస్తున్న కళాకారులు దేవతామూర్తులు, బుద్ధుడి విగ్రహాలకు పెట్టింది పేరు 2017లో దుర్గి శిల్పాలకు జియోగ్రాఫికల్ గుర్తింపు నాడు వందల్లో కళాకారులు... నేడు 25 మందే ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించి శిల్పాలు చెక్కుతున్న వైనం
ప్రస్తుతం 25 కుటుంబాలే...
క్రీ.శ 12వ శతాబ్దంలో ఆరంభం...
2017లో జియోగ్రాఫికల్ గుర్తింపు...
ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి...
సాక్షి, నరసరావుపేట, దుర్గి:
ఆ గ్రామం అమరశిల్పులకు పుట్టినిల్లు. జీవంలేని బండరాళ్లను ఉలిదెబ్బలతో గాయాలు చేసి జీవం పోసి అందమైన ఆకృతులను మలచడం వారి ప్రత్యేకత. రాజులు పోయినా, రాజ్యాలు కూలినా ఆనాటి శిల్పకళను మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన శిల్పుల చేతిలో దేవతామూర్తులు, పల్లెపడుచులూ, హోయలుపోతున్న సుందరాంగులూ, మహనీయుల విగ్రహాలు ఇలా ఒకటేంటి ఎన్నో అద్భుతాలను రూపుదిద్దుకుంటున్నాయి. ఖండాంతరాలు దాటిన ఖ్యాతిని గడించిన ఆ గ్రామం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి. ఆ గ్రామంలో శాలివాహనులు, కాకతీయుల కాలం నాటి ప్రాచీన శిల్ప కళా చాతుర్యం ఉట్టిపడుతుంది. ఇక్కడ ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగులు, ఇంకా ఎత్తయిన శిల్పాలు చెక్కడంలో ఇక్కడి శిల్పులు సిద్ధహస్తులు. దేవతామూర్తులు, బుద్ధుడు, రాధాకృష్ణులు, రాచరిక హుందాతనాన్ని తెలిపే విగ్రహాలను అలవోకగా చెక్కుతారు.
దుర్గి శిల్ప కళకు శతాబ్దాల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలోనే ఆ ప్రాంతంలో ప్రాచీన కళకు బీజం పడింది. ఆచార్య నాగార్జునులు పెందోట వాసి అని ఐతిహ్యం. పెందోట నుంచి కొంత మంది శిల్పులు ద్వారకాపురికి వలస వెళ్లారు. ప్రకృతి వైపరీత్యమో, శత్రువుల దాడుల కారణంగానో క్రీ.శ 11వ శతాబ్దంలో ద్వారకాపురి నాశనం అయింది. ఈ క్రమంలో ద్వారకాపురి నుంచి వలస వచ్చిన కొందరు శిల్పులు ఓ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, శత్రువుల నుంచి రక్షణ కల్పించమని దుర్గా దేవి విగ్రహాన్ని ఒకటి చెక్కి అక్కడ ప్రతిష్టించారు. శిల్పులు ఆ ప్రాంతానికి ‘దుర్గి’గా నామకరణం చేశారు. అమరావతి, నాగార్జున కొండల్లోని బౌద్ధ స్తూపాలను దుర్గి కళాకారులే మలిచారని చరిత్రకారులు చెబుతుంటారు. విజయపురిసౌత్, నాగార్జున కొండకు వచ్చే దేశ, విదేశీ బౌద్ధ ఆరాధికులు దుర్గి గ్రామాన్ని సందర్భించి ఇక్కడి శిల్పులు మలచిన బౌద్ధ విగ్రహాలు కొని తీసుకెళ్తుంటారు. రాష్ట్రంలోని పలు నగరాల్లోని దేవాలయాలు, పార్కులు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో దుర్గి విగ్రహాలు ఠీవిగా నిలబడి దర్శనమిస్తుంటాయి.
దుర్గి శిల్పాలకు ఖండాంతర ఖ్యాతి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు ఇక్కడి విగ్రహాలు ఎగుమతి అవుతాయి. ముఖ్యంగా ఇక్కడ మలిచే చిన్న చిన్న బుద్ధుడు, వినాయకుడు, రాధాకృష్ణుల విగ్రహాలు దేశ విదేశాలలో ఎక్కువ గిరాకీ ఉంటుంది. 2014లో శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం దేవాలయానికి దశావతరాల విగ్రహాలు దుర్గి శిల్పకారులే అందజేశారు. తెలంగాణ రాష్ట్రం బుద్ధవనానికి విగ్రహాలను దుర్గి కళాకారులే తీర్చిదిద్దారు. 2017లో దుర్గి శిల్పాలకు కేంద్రప్రభుత్వం జియోగ్రాఫికల్ గుర్తింపును అందజేసింది. ఇక్కడ మలిచే లైమ్ హార్డ్ రాయి విగ్రహాలకు ప్రత్యేకత ఉంది. అరుదైన ఈ రాయి దుర్గి గ్రామంలోనే ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓ క్వారీలో మాత్రమే లభిస్తుందని ఇక్కడి శిల్పులు చెబుతారు. దుర్గిలో మలిచిన శిల్పాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని లేపాక్షి స్టాల్స్‌లో లభిస్తాయి. గ్రామంలో ఐదు శిల్ప తయారీ కేంద్రాలు ఉన్నాయి.
దుర్గి శిల్పకారులు చెక్కిన యువతి విగ్రహం
దుర్గి శిల్పకారులు చెక్కిన బుద్ధుడి విగ్రహం
దుర్గి శిల్ప కళ నానాటికి అంతరించిపోయే దిశగా అడుగులు వేస్తోందని ఇక్కడి శిల్పులు చెబుతున్నారు. 1960 నుంచి 2000 సంవత్సరాల మధ్య 300 మంది వరకు శిల్పులు గ్రామంలో ఉండేవారు. కాల క్రమంలో వీరి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 25 కుటుంబాలు మాత్రమే గ్రామంలో శిల్ప కళా వృత్తిలో ఉన్నారు. కనుమరుగవుతున్న దుర్గి శిల్పకళను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో 1962లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం శిల్పకళా శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ కేంద్రం ద్వారా వందల మంది శిల్ప కళలో శిక్షణ పొందిన శిల్పులు ఏపీ, తెలంగాణాతో పాటు ఇతర రాష్ట్రాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక కుటుంబాలు వేరే వృత్తులకు వెళ్లడంతో తమిళనాడు, ఒడిశాల నుంచి కార్మికులను రప్పించి, వారికి తగిన శిక్షణ ఇచ్చి పనిచేయించుకుంటున్నారు. శిల్ప తయారీ కేంద్రాలకు ఒప్పందాలు ఉన్నప్పుడు వారిని రప్పించి పని పూర్తి కాగానే పంపుతున్నారు. పెరుగుతున్న ఖర్చులు, మారుతున్న పరిస్థితులతో శిల్ప వృత్తికి దూరమవుతున్నారని ప్రభుత్వం తోడ్పాటు అందిస్తేనే ఈ కళ బతుకుతుందని స్థానికులు అంటున్నారు.
దేశవ్యాప్తంగా దుర్గి శిల్ప కళలకు ఎంతో ప్రాచుర్యం ఉంది. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా లభించే దుర్గి రాయి ద్వారా మలిచే శిల్పాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా బుద్ధుడి విగ్రహాలను ఎంతో మంది విదేశీయులు వచ్చి తీసుకెళ్లారు.. నేను యువకుడిగా ఉన్న సమయంలో వందల మంది ఉన్న శిల్పులు నేడు పదుల సంఖ్యలోకి వచ్చేశారు. ప్రభుత్వం చేయూతనిచ్చి శిల్ప కళలను ప్రోత్సహించాలి. అప్పుడే కళ పదికాలాల పాటు నిలిచి ఉంటుంది. లేకపోతే దుర్గి శిల్ప కళా వైభవం అంతరించిపోతుంది.
– శెట్టిపల్లి యలమంద, జెడ్పీటీసీ, దుర్గి
దుర్గి శిల్ప కళా వైభవం
దుర్గి శిల్ప కళా వైభవం


