గ్రానైట్ సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ
● చైర్మన్‌గా జేడీ, కన్వీనర్‌గా ప్రకాశం డీడీతో కలిపి మొత్తం 16 మందితో కమిటీ ఏర్పాటు
● 15వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఆదేశాలు
చీమకుర్తి: గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు ఎదుర్కొంటున్న పలు సమస్యల అధ్యయనానికి 16 మందితో నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ మైన్స్ డైరెక్టర్ బాలచంద్రశేఖర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మన్‌గా జేడీ మైన్స్ డీ శ్రీనివాసరావు, మెంబర్ కన్వీనర్‌గా ప్రకాశం మైన్స్ డీడీ టీ రాజశేఖర్‌ను నియమించారు. వారితో కలిపి మొత్తం 16 మందిని కమిటీలో నియమించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో గ్రానైట్ రంగంలో ప్రస్తుత సమస్యలను అధ్యయనం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్లాబ్ సిస్టంలో ప్రస్తుత రేట్లను సమీక్షించాలని, గ్రానైట్ నాణ్యత, మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకోవాలని, ట్రాన్సిట్ పాస్‌లు, ఎండీఎల్ ఆవశ్యతను అంచనా వేయాలని, గ్రానైట్ రాళ్ల కటింగ్‌లో కొత్త యంత్రాలతో వచ్చే ప్రొడక్షన్‌ను ఆధారంగా చేసుకుని అధ్యయనం చేయాలని, గ్రానైట్ బ్లాకులకు శ్లాబు వ్యవస్థను ప్రవేశపెట్టడంపై అధ్యయనం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీనరేజీ ఫీజు వసూలు కాంట్రాక్ట్, కటింగ్ ఫ్యాక్టరీల సమస్యలను పరిశీలించటం, అనుమతులు జారీ చేయటం వంటి పలు రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 15వ తేదీలోపు నివేదిక సమర్పించాలని మైన్స్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
బాపట్ల టౌన్: బాపట్ల రైల్వే స్టేషన్‌లో గురువారం గూడ్స్ రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. జీఆర్‌పీ ఎస్‌ఐ సరస్వతి తెలిపిన వివరాల ప్రకారం... చీరాల పట్టణం విఠల్ నగర్ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మారుగడ సురేష్ బాబు (20) ప్రతిరోజు రైలులో వచ్చి బాపట్ల, కర్లపాలెం ప్రాంతాల్లో పనులు చేసుకొని తిరిగి వెళ్తుంటాడు. ఈ క్రమంలో గురువారం బాపట్లలో రైలు దిగి ఉప్పరపాలెం గేటు సమీపంలో ట్రాక్ దాటుతుండగా అదే సమయంలో అటువైపుగా వచ్చిన గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సురేష్‌బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ గేటు దాటుతుండగా ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


