
పంటలు నమోదు చేయించుకుంటేనే పరిహారం
అచ్చంపేట: రైతులంతా పంటలను వ్యవసాయ సిబ్బందితో సంబంధిత యాప్‌లో నమోదు చేయించుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వం నుంచి నష్ట పరిహారా లు, రాయితీలు వర్తించవని జిల్లా వ్యవసాయాధికారి యం.జగ్గారావు తెలిపారు. మండలంలోని చిగురుపాడు, చింతపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన పత్తి పొలాల్లో పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. వ్యవసాయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులతో సంప్రదించి ప్రతి ల్యాండ్ పార్సిల్‌ని పూర్తి చేయాలని ఆదేశించారు. పంట నమోదుకు ఈనెల 25వరకు గడువు ఉన్నట్లు చెప్పారు. ఈలోపు సాగులో ఉన్న పత్తి పంటను యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. రానున్న రబీ సీజన్‌లో రాయితీపై శనగలు, మినుములు ఇవ్వనున్నట్లు రైతులకు తెలిపారు.
ఎరువుల దుకాణాలు తనిఖీ
అనంతరం ఆయన అచ్చంపేటలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. ఎమ్మార్పీకి మించి విక్రయించరాదని, రైతు కోరిన ఎరువునే ఇవ్వాలని చెప్పారు. పురుగు మందు కొంటేనే యూరియా ఇస్తామని అనడం సరికాదని దుకాణాదారులను హెచ్చరించారు. దుకాణాల్లో స్టాకు బోర్డులు, వాటి ధరలను పొందుపరచాలని ఆదేశించారు. కొనుగోలు చేసే రైతుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలన్నారు. రైతులు వాటిని పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. అధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేసిన నాణ్యత గల పురుగు మందులు, ఎరువులను విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. నాణ్యతలేని పురుగు మందులు విక్రయించినా, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మినా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు మండల వ్యవసాయాధికారి పి.వెంకటేశ్వర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.