
తిమ్మాపురం బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం
యడ్లపాడు/మార్టూరు: ఆసుపత్రికని తీసుకువచ్చిన వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన యడ్లపాడు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా, మార్టూరు మండలం, జొన్నతాళి గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతరావు (62) అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను మంగళవారం కుటుంబ సభ్యులు చిలకలూరిపేట పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకొచ్చారు. ఆసుపత్రి వద్ద హనుమంతరావు వాష్‌రూంకు వెళ్లి వస్తాను అని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వచ్చి 16వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ తిమ్మాపురం బైపాస్ వంతెన సమీపానికి చేరుకున్నారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం వృద్ధుడిని ఢీకొట్టి, నిలుపకుండానే వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయన కోసం వెతకడం ప్రారంభించారు. మృతుడి సోద రుడి కుమారుడు శివరాత్రి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు హనుమంతరావుకు భార్య, పిల్లలు లేకపోవడంతో సోదరుడి కుమారుడి వద్దనే ఉంటున్నారు. మానసిక పరిస్థితి సక్రమంగా లేనందునే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హైవే మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పరారైన వాహనం డ్రైవర్‌ను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని
బాపట్ల జిల్లా వాసి మృతి