
దీపావళి వేళ... అలుముకున్న విషాదం
పీసపాడు(క్రోసూరు): ఇళ్లల్లో వెలుగులు నింపే దీపావళి పండుగ ఆఇంట్లో అగ్నిప్రమాదం సంఘటన జరిగి విషాదాన్ని నింపింది. సోమవారం ఉదయం పదిగంటలకు మండలంబలోని పీసపాడు గ్రామంలోని కంచేటి సాంబశివరావు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం చోటు చేసుకోవటంతో నలుగురు మంటల్లో చిక్కుకుని గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ అయిపోవటంతో కొత్త సిలిండర్ మార్చటం జరిగింది. అయితే దానిలో సమస్య ఉండటంతో గ్యాస్ లీక్ అవుతూ ఉంది. దీన్ని గమనించి ఎదురుగా ఉంటున్న చిన్ని కోటేశ్వరరావు ను పిలిపించారు. అక్కడికొచ్చిన కోటేశ్వరరావు సిలిండర్ లీకేజి పరిశీలిస్తున్న క్రమంలో వంటగదిలో స్విచ్ వేయటంతో అకస్మాత్తుగా మంటలంటుకున్నాయి. సిలెండర్ పేలిపోవటంతో ఇళ్లు పాక్షిక్లంగా ధ్వంసమైంది. కంచేటి సాంబశివరావు, కంచేటి త్రివేణి, కంచేటి యతేంద్ర, (మనవడు) చిన్న కోటేశ్వరరావుకు శరీరాలకు మంటలంటుకుని తీవ్రగాయాలపాలయ్యారు. చుట్టుపక్కల వారి సహాయంతో వీరిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా వారిలో కోటేశ్వరరావు, యేతేంద్రలు గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోటేశ్వరరావు పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు ఎస్‌ఐ రవిబాబు తెలిపారు. సీఐ సురేష్, ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం వివరాలు నమోదు చేసుకున్నారు.
పీసపాడులో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం
మంటల్లో చిక్కుకుని నలుగురికి తీవ్రగాయాలు

దీపావళి వేళ... అలుముకున్న విషాదం