
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
నరసరావుపేట టౌన్: రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్‌నగర్ స్వామి స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ ఖాశిం అలి(47) ఇంటలిజెన్స్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో డీఎస్పీ కార్యాలయ సమీపంలోకి రాగానే ముగ్గురు ఎక్కి వస్తున్న ద్విచక్రవాహనం ఖాశిం అలి వాహనాన్ని ఢీకొంది. సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రుడిని ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనం నడుపుతున్న నిందితుడు పూటుగా మద్యం సేవించి అతి వేగంగా వచ్చి వాహనాన్ని ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న హోంగార్డు ఆర్‌ఐ కృష్ణ, ఇంటలిజెన్స్ సీఐ శివాంజనేయులు మంగళవారం మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
పండగ పూట విషాదం..
వెలుగుల పండుగ దీపావళి నాడు హోంగార్డు కుటుంబం చీకట్లో మునిగిపోయింది. పండుగ నాడు భార్య షర్మిల, ఇద్దరు పిల్లలతో బాణాసంచా కాల్చాలని విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న హోంగార్డు అనుకోని రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పండుగరోజు సంతోషం బదులు ఆ ఇంట్లో విషాదం నిండింది. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు విలపించిన తీరుతో ప్రకాష్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న
మరో ద్విచక్ర వాహనం
దీపావళి నాడు ఇంటికి వెళ్తుండగా
సంఘటన
మృతుడు ఇంటెలిజెన్స్ విభాగంలో
విధులు నిర్వహణ