
జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికై న ఎఫ్రాయిం
చీరాల రూరల్: జాతీయస్థాయి సబ్‌జూనియర్ ఫుట్‌బాల్ జట్టుకు చీరాల క్రీడాకారుడు ఎన్. ఎఫ్రాయిం ఎంపికయ్యాడు. ఈ మేరకు జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ నుంచి ఉత్తర్వులు అందినట్లు బాపట్ల జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.విజయ్‌కుమార్ మంగళవారం తెలిపారు. చీరాల మేరి క్రిస్టియన్ పేటకు చెందిన ఎన్.ఎఫ్రాయిం గౌతమి ఈ–టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. చిన్నతనం నుంచి ఫుట్‌బాల్ ఆటంటే మక్కువ చూపే ఎఫ్రాయింను.. ప్రేమయ్య ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్ ఫుట్‌బాల్ క్యాంపులో బాలుని తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించారు. అప్పటినుంచి అనేక పోటీల్లో పాల్గొని తన ప్రతిభతో సెలక్టర్లను ఆకర్షించాడు. ఈఏడాది మేలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్ జూనియర్ ఫుట్‌బాల్ సెక్షన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జోనల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూలైలో గుంటూరు జిల్లా పేరేచర్లలో నిర్వహించిన జోనల్ పోటీల్లో బాపట్ల జిల్లా జట్టును తన ప్రతిభతో ప్రథమ స్థానంలో నిలిపాడు. తదననంతరం 23, 24 తేదీల్లో రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ సబ్ జూనియర్ జట్టుకు బాపట్ల జిల్లా జట్టు తరఫున ఎంపికయ్యాడు. ఈ జట్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో సెలక్లర్లు జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేశారు. ఈనెల 26 నుంచి 31 వరకు ఛత్తీస్‌గడ్‌లో జరిగే జాతీయ స్థాయి సబ్ జూనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. జాతీయజట్టుకు ఎంపికై న ఎఫ్రాయింను జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, సమ్మర్ ఫుట్‌బాల్ క్యాంప్ ఇన్‌చార్జ్ బొనిగల ప్రేమయ్య, కోచ్ ప్రసన్న, సీనియర్ క్రీడాకారులతో పాటు కుటుంబ సభ్యులు అభినందించారు.