
బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్త !
బాపట్ల టౌన్: బాణసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాగ్రత్తలు పాటిస్తూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని సూచించారు. దీపావళి పండుగ చీకట్లను పారదోలి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి అని పేర్కొన్నారు. పిల్లలు బాణసంచా కాల్చే సమయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బాణసంచా కాల్చేటపుడు కాటన్ దుస్తులు ధరించాలని, ఇంటి లోపల కాల్చరాదని తెలిపారు. టపాకాయలను చేతిలో పెట్టుకొని కాల్చకూడదని, కొవ్వొత్తి, అగరబత్తి లాంటి వాటిని వినియోగించాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే డయల్ 112 కు కాల్‌చేసి సమాచారం అందించాలని ఆయన తెలిపారు. పోలీస్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. బాణసంచా విక్రయ దుకాణాల వద్ద అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తగిన భద్రత చర్యలు తీసుకోవాలని తెలిపారు. దుకాణాల వద్ద నీరు, ఇసుక తప్పనిసరిగా సిద్ధంగా ఉండేట్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
ఎస్పీ బి. ఉమామహేశ్వర్