
అవినీతి ఖరారు.. చర్యల్లో బేజారు
ఉపాధి హామీ పనుల్లో భారీగా అక్రమాలు బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో సొమ్ము స్వాహా సామాజిక తనిఖీ, ప్రజా వేదికలు ముగిసిపోయి 70 రోజులు రూ.కోట్ల మేర అవినీతి బయటపడినా చర్యలు శూన్యం
బల్లికురవ: వలసలను నిరోధించి ప్రతి ఒక్కరికి పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ ఉపాధి హమీ పథకం బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో అపహాస్యం పాలైంది. గ్రామ స్థాయి నేతలతో సిబ్బంది కుమ్మక్కు కావడంతో ప్రభుత్వ సొమ్ము స్వాహా అవుతోంది. బల్లికురవ మండలంలో 2024 –25 ఆర్థిక సంవత్సరానికి 21 గ్రామ పంచాయతీలలో రూ. 12 కోట్లతో 645 పనులు మంజూరవగా, పూర్తి చేశారు. జూలైలో జరిగిన సామాజిక తనిఖీ, ఆగస్టు 6, 7వ తేదీల్లో బల్లికురవలో జరిగిన బహిరంగ ప్రజావేదికలో రూ.5 కోట్లమేర అవినీతి జరిగినట్లుగా డ్వామా పీడీ విజయలక్ష్మి తదితరులు గుర్తించారు. మస్టర్‌లలో లోపాలు, చేసిన పనులనే పదేపదే చూపటం, మొక్కలు నాటకుండా నాటినట్లుగా రికార్డులకే పరిమితం చేసినట్లు వెల్లడైంది. మల్లాయపాలెం మాజీ సర్పంచ్ అబ్బారెడ్డి బాలకృష్ణ అవినీతిపై బహిరంగ ప్రజావేదికలో పీడీకి ఆధారాలతో నివేదించారు. 70 రోజులు దాటినా అవినీతి పనులపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.
సంతమాగులూరులోనూ..
బల్లికురవకు సమీప మండలమైన సంతమాగులూరులో కూడా ఇదే పంథా కొనసాగింది. శనివారం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జరిగిన బహిరంగ ప్రజావేదికలో తామేమీ తక్కువ కాదు అన్నట్లు ఓ గ్రామ స్థాయి నేత డీఆర్‌పీపై చేయిచేసుకునేంత వరకు వెళ్లింది. అంటే అక్కడ అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. 20 గ్రామ పంచాయతీల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి 760 పనులను రూ.10.5 కోట్లతో చేపట్టారు.

అవినీతి ఖరారు.. చర్యల్లో బేజారు