
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మార్టూరు: ఇసుక దర్శి గ్రామ పొలాల్లోని వ్యవసాయ బావిలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం శనివారం బయట పడింది. నడుముకు, కాలికి తాళ్లతో కట్టిన రాళ్లు వేళ్లాడుతుండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. కొనంకి గ్రామ పరిధిలోని వలపర్లకు చెందిన వెచ్చా బుజ్జయ్య వ్యవసాయ బావిలో మృతదేహం ఉండటతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శేషగిరిరావు సిబ్బందితో అక్కడకు చేరుకుని స్థానికుల సహకారంతో బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం సుమారు ఐదు రోజుల నుంచి బావిలో ఉండొచ్చని, వయస్సు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బాపట్ల డీఎస్పీ గోగినేని రామాంజనేయులు మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు.
యద్దనపూడి: అప్పులు తీర్చలేక మనోవేదనకు గురై జీవితంపై విరక్తి చెంది పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని చింతపల్లిపాడులో చోటు చేసుకుంది. చింతపల్లిపాడు ఎస్సీ కాలనీకి చెందిన బత్తుల చిట్టిబాబు (46) భార్య 2015లో మరణించింది. దీంతో ఇద్దరు సంతానంతో తల్లి వద్దే ఉంటున్నాడు. చిట్టిబాబు కొంత పొలం కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నాడు. పిల్లల చదువు కోసం, వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమందు తాగాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు చిలకలూరిపేట ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని సోదరుడు చినభూషణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రత్నకుమారి తెలిపారు.
లక్ష్మీపురం: రైల్వే శాఖ 2018లో జనరల్ ప్రయాణికుల కోసం యూటీఎస్ యాప్ తెచ్చిందని అధికారులు తెలిపారు. డివిజన్లలో పూర్తిస్థాయిలో వినియోగించేలా ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు గుంటూరు రైల్వే డీఆర్‌ఎం సుథేష్ట సేన్ గుంటూరు పట్టాభిపురంలోని తన కార్యాలయంలో శుక్రవారం యాప్ లోగో ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ యాప్ వినియోగం గురించి ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందులో సీజన్, ప్లాట్‌ఫారం, సాధారణ ప్రయాణ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చన్నారు. సీజన్ టికెట్‌ల రెన్యూవల్ ముందుగానే చేసుకోవచ్చని సూచించారు. డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్, డీసీఎం కమలాకర్ బాబులు దీనిపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం