
కూటమి కుట్రలు బహిర్గతం చేద్దాం
వైఎస్సార్ సీపీ చీరాల సమన్వయకర్త కరణం వెంకటేష్‌బాబు కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ
చీరాల: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి కుట్రలను బహిర్గతం చేద్దామని వైఎస్సార్ సీపీ చీరాల సమన్వయకర్త కరణం వెంకటేష్ బాబు పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొస్తే, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేటుపరం అయితే ఫీజులు ఎక్కువగా ఉంటాయని, పేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి కుట్రలను బహిర్గతం చేయడానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ రూపొందించారని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అనాలోచిత చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. చీరాల నియోజకవర్గంలో 60 వేల మంది సంతకాలు సేకరించి వాటిని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందించనున్నట్లు పేర్కొన్నారు. వాటిని పార్టీ తరఫున గవర్నర్‌కు పంపిస్తామని వెల్లడించారు.
పాలనపై తీవ్ర అసంతృప్తి..
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సాగుతున్న పాలనపై ప్రజల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉందని కరణం వెంకటేష్‌బాబు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మేలు జరిగేలా మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేసి దండుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కార్యక్రమాన్ని వార్డుల్లో, గ్రామాల్లో నిర్వహించేందుకు గ్రామాలు, మండలాల వారీగా కమిటీలు వేస్తామని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి కోటి సంతకాలు పూర్తి చేయాలని కోరారు. తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని భరోసా కల్పించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని, నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల వాసు, లీగల్ సెల్ అధ్యక్షుడు రాజు వెంకటేశ్వరరెడ్డి, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవ, మాజీ అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు, రమణారెడ్డి, కౌన్సిలర్లు కీర్తి వెంకట్రావు, కంపా అరుణ్, చీమకుర్తి బాలకృష్ణ, మైనార్టీ సెల్ నాయకులు షేక్ కబీర్, విద్యార్థి విభాగం జిల్లా నాయకులు గోసాల అశోక్, పి.శ్రీనివాసరెడ్డి, రాజ్‌కుమార్, సాంబిరెడ్డి, బిట్రా శ్రీనివాసరావు, డి.వెంకటసుబ్బారావు, ఎ.కొండలు, ఖాదర్ పాల్గొన్నారు.

కూటమి కుట్రలు బహిర్గతం చేద్దాం